నిర్మల్ (మామడ) : మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై ఎస్సారెస్పీ సదర్‌మాట్ బ్యారేజి నిర్మాణంలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించేందుకు కొన్ని రోజులుగా అధికారులు సర్వే చేస్తున్నారు. బుధవారం పొన్కల్ రైతుల పంట పొలాల్లో సర్వే నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సర్వే నిర్వహించొద్దని స్పష్టం చేశారు. సర్వే పనులను అడ్డుకోవడంతో అధికారులు గ్రామానికి తిరిగి వచ్చారు.
విషయం తెలుసుకున్న తహశీల్దార్ రామస్వామి, ఎస్పారెస్పీ డీఈ వెంకటేశ్వర్లు పొన్కల్ గ్రామానికి వచ్చారు. అప్పటికే కొందరు రైతులు, గ్రామస్తులు వాహనాల్లో వెళ్లి మామడ మండల కేంద్రంలోని నిర్మల్, ఖానాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బ్యారేజి నిర్మాణం కోసం చేపడుతున్న సర్వే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో తహశీల్దార్ రామస్వామి, డీఈ వేంకటేశ్వర్లు,ఏఎస్‌ఐ సిద్దేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సర్వేను నిలిపివేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. బాధిత రైతులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
సర్వే పనులను అడ్డుకున్న రైతులు
Published Thu, Nov 27 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement