ఇక వానలే వానలు
రాష్ట్రంలో ఈసారి వర్షాలు అధికంగా కురవనున్నాయి. నిర్ణీత వర్షపాతం కంటే 6 శాతం వరకు అధికంగా వర్షం కురుస్తుందని వాతావరణ అధ్యయనకారులు పేర్కొంటున్నారు. ప్రతిఏటా జూన్‌లో రాష్ట్రంలోకి వచ్చే రుతుపవనాలు ఈ సారి మాత్రం మేలోనే రానున్నాయట. మరి ఇక వర్షంలో తడిసిపోదామా..!
బెంగళూరు: కర్ణాటకలోని రైతులకు శుభవార్త. రెండేళ్లుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రైతులు కరువు ఛాయల్లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. సరైన వర్షాలు లేక సాగునీరు అందక అనేక ప్రాంతాల్లో పంట భూములు సైతం బీడు వారాయి. దీంతో పశుగ్రా సం కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఏడాది మాత్రం నైరుతి రుతుపవనాలు రైతుల జీవితా ల్లో సంతోషాలను వర్షించనున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు నివేదిక పేర్కొం టోంది. అంతేకాదు నైరుతి రుతుపవనాలకు సంబంధించి నిర్ణీత వర్షపాతం కంటే దాదాపు ఆరు శాతం వరకు ఎక్కువ వర్షపాతం రాష్ట్రంలో ఈ ఏడాది నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోకి జూన్ మొదటి వారంలోనే ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం నిర్ణీత సమయం కంటే ముందుగానే మే 27 నుంచి 29 లోపే రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా కురిసే వర్షాల్లో నిర్ణీత వర్షపాతం కంటే మూడు నుంచి ఆరు శాతం వరకు ఎక్కువగానే వర్షపాతం నమోదు కావచ్చని సైతం వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, తీర ప్రాంతాల్లో సైతం సరిపడా వర్షాలు కురవనున్నాయి. ఇక మే చివరి వారంలో ప్రారంభమైన నైరుతి రుతుపవనాల ప్రభావం జూలై నాటికి పూర్తిగా పుంజుకోనున్నాయి. అయితే రాష్ట్రంలోని బెళగావి, హావేరి, ధార్వాడ, గదగ్ ప్రాంతాల్లో మాత్రం నిర్ణీత వర్షపాతం కంటే కాస్తంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు వి.ఎస్.ప్రకాష్ చెబుతున్నారు.