పేడే పెన్నిధి! | cow dung is more usefull | Sakshi
Sakshi News home page

పేడే పెన్నిధి!

Published Sun, Jan 26 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

పేడే పెన్నిధి!

పేడే పెన్నిధి!

 ఆల మందను చూసి ఆడపిల్లని ఇవ్వాలి అనేది పెద్దల మాట. పాడి ఉన్న చోట పంట ఉంటుందని, ఇవి ఉన్న ఇంటిలో ఆడపిల్ల హాయిగా బతుకుతుందని నాటి పెద్దల భరోసా.  పాడికి పంటకు ఉన్న సంబంధం దండలో దారం లాంటిది.. ఒక్కమాటలో.. పంటకు పేడే పెన్నిధి!
 
 పంట భూములను సారవంతం చేయాలంటే పశువుల పేడను ఏదో ఒక రూపంలో వాడటమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి మెరుగుపరచిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వరకు.. పశువుల ఎరువు దగ్గర నుంచి పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం వరకు.. అన్నిటిలోనూ మోతాదు మారినా పేడ వాడకం మాత్రం తప్పనిసరి.
 
 ఇంతకూ పేడలో ఏముంది?
 మనిషిని, అతని చుట్టూ ఉన్న ప్రకృతిని దేవుడు శాసిస్తుంటాడనేది కొందరి విశ్వాసం. జీవుల మనుగడ వెనుక కంటికి కనిపించకుండా అంతటా ఆవరించిన శక్తులు ఉన్నాయన్నది మాత్రం నిర్ధారిత నిజం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో కోటాను కోట్ల సూక్ష్మజీవుల సముదాయమే శక్తి. ఆవు పేడ, మూత్రాలలో హితోపకారులైన ఈ సూక్ష్మజీవుల సముదాయాలు కోటాను కోట్లున్నాయి. ఒక గ్రాము పేడలో మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల సూక్ష్మజీవులున్నాయని అంచనా. ఇవి తమ జీవనక్రియ ద్వారా మనిషి మనుగడకే కాదు.. నేల మీద ఉనికిలో ఉన్న అన్ని రకాల జీవజాలం మనుగడకు అవసరమైన వనరులను అందిస్తున్నాయి. ప్రధానంగా పంటల విషయానికి వస్తే.. ఇవి నేల, గాలి, నీరులో ఉన్న అన్ని రకాల పోషకాలను సంగ్రహించి మొక్కలకు అందజేస్తున్నాయి.
 
 సూక్ష్మజీవులే పంటకు పోషణ, రక్షణ!
 పేడ ఎరువు ద్వారా పొలం మట్టిలోకి చేరిన ‘మేలు చేసే’ సూక్ష్మజీవులే మన పంటలకు పోషకాలను అందిస్తున్నాయి. కీడు చేసే ఇతర రకాల బాక్టీరియా, వైరస్, శిలీంద్రాలను నియంత్రించే కాపాలాదారులుగా కూడా వ్యవహరిస్తూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మన ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గు పెట్టుకునే సంప్రదాయం వెనుక దాగిన సత్యం ఇదే. ఇవి విరామమెరుగక చెమటను చిందించే రైతు కంటే ఎక్కువగా అనుక్షణం శ్రమిస్తుంటాయి. ఇవే కాకుండా మొక్కల మనుగడకు, ఎదుగుదలకు అవసరమైన స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్ ఉన్నాయి. వీటికి తోడు కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, రాగి, సల్ఫర్, మాంగనీస్, మల్బేడినమ్, వనాడియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు పంటలకు అత్యవసరమైన అమినో ఆమ్లాలు పేడలో ఉన్నాయి. తొలి వ్యవసాయ సమాజాలు ఏర్పడిన నాటి నుంచి కొనసాగిన అనుభవాలను క్రోడీకరించి పూర్వీకులు ప్రాచీన భారతీయ వ్యవసాయ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ‘కృషి పరాశర’, ‘వృక్షాయుర్వేద’, ‘కృషివల్లభ’, ‘కాష్యపీయ కృషి సూక్తి’, ‘లోకోపకార’ తదితర ప్రాచీన భారతీయ వ్యవసాయ విజ్ఞాన గ్రంథాలన్నిటిలోనూ పశువుల పేడ, పశువుల మూత్రంను వివిధ పద్ధతుల్లో వ్యవసాయానికి ఎలా వాడేదీ వివరించారు. పేడ, మూత్రంలను ఎరువులుగా, చీడపీడల నివారిణులుగా ఉపయోగించడం గురించి విశదపరిచారు.
 
  ఏభయ్యేళ్ల క్రితం వచ్చిపడిన పారిశ్రామిక వ్యవసాయ విధానంతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు రంగ ప్రవేశం చేశాయి. సూక్ష్మజీవరాశికి నిలయమైన పేడ తదితర సేంద్రియ పదార్థాలకు ప్రాధాన్యం తగ్గి.. వివిధ రకాల రసాయనాలకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. ఫలితంగా వ్యవసాయం అభివృద్ధి మాటెలా ఉన్నా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పర్యావరణ సమతుల్యత  దెబ్బతిన్నది. కాలం అకాలమై, రుతువులు గతి తప్పాయి. ఈ విషయాన్ని వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తలు మొదలు సాధారణ వ్యవసాయ కూలీల వరకు అందరూ గుర్తించారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం తిరిగి తన మూలాలను శోధించుకోవాల్సి వస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు ఉద్యమ స్థాయికి చేరుకున్నాయి. కృత్రిమ రసాయనిక ఎరువుల స్థానంలో.. పేడ, మూత్రంలతో తయారైన సహజ ఎరువులు, పంటల వ్యర్థాలతో తయారయ్యే కంపోస్టులే భూమికి బలిమిని, రైతుకు కలిమిని ఇస్తున్నాయి. ఎందరో రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి సాగు ఖర్చులు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు.
 - ‘సాక్షి’ సాగుబడి డెస్క్
 
 ఆవు పేడతో ఉపయోగాలెన్నో!
  ఆవు పేడ ఉపయోగాలేమిటి? అని అడగటం అంటే.. సూర్యుడి ప్రయోజనం ఏమిటి? అని అడగటం వంటిదే!
  రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు నిస్సారమయ్యాయి.  తిరిగి సారవంతం చేయడం ఆవు పేడ, మూత్రంతోనే సాధ్యం.
  వ్యవసాయానికి దిబ్బ ఎరువు, పంచగవ్య, బీజామృతం, జీవా మృతం, అమృత్‌పానీ తయారీలో ఆవు పేడ వాడకం తప్పనిసరి.
  పంచగవ్యను మనుషులకూ ఔషధంగా వాడుతున్నారు.
 కిలో పేడతో ‘నాడెప్’ పద్ధతిలో 20 కిలోల ఎరువును చేయొచ్చు.
 సేంద్రియ పురుగుమందులతోపాటు సౌందర్య సాధనాలు, కాగితం, దోమల కాయిల్స్, ధూప్ స్టిక్స్ తయారీలో ఉపయోగ పడుతోంది.
 గ్రామస్థాయిలో గోబర్ గ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసు కోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పేడ ప్రయోజనాలు ఇంకెన్నో..
 
 మెట్ట ప్రాంతాల  ఆవుల పేడ శ్రేష్టం
 సాధారణంగా పశువుల పేడలో నత్రజని 3%, ఫాస్ఫరస్ 2%, పొటాషియం 1% ఉంటాయి. అయితే, జంతువును బట్టి, జాతిని బట్టి, మేతను బట్టి పేడలో పోషకాల శాతం మారుతుంటుంది. మెట్ట ప్రాంతాల్లో గడ్డి మేసే ఆవుల పేడలో అన్ని రకాల (స్థూల, సూక్ష్మ) పోషకాలు, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి.     - డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు,
 అంతర్జాతీయ పశు పరిశోధనా సంస్థ, పటాన్‌చెరు, హైదరాబాద్
 
 పాశ్చాత్యులకూ పేడంటే ప్రేమే!
 సూక్ష్మజీవులు, వానపాములు వ్యవసాయం లో అంతర్భాగమని తొలుత గుర్తించి, ప్రకటించిన మహానుభావుడు జీవపరిణామ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన స్ఫూర్తితో.. బాలలకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పుతున్న ఉపాధ్యాయులను అమెరికాకు చెందిన ఎఫ్‌ఎఫ్‌ఎ సంస్థ సన్మానిస్తోంది. ఎండిన ఆవు పేడ ముద్దకు బంగారు పూతపూసి బహుమతిగా ఇస్తోంది. 2013లో బెట్టీకూన్ అనే ఉపాధ్యాయినికి ఈ అవార్డు దక్కింది.
 
 ప్రాణ రక్షక ఔషధం పేడ!
 పేడ సజీవమైన ఎరువు. మట్టిలోని జీవులకు పేడ ప్రాణ రక్షక ఔషధం వంటింది. భూసారాన్ని పెంపొందించడంలో పేడ పాత్ర చాలా ముఖ్యమైనది.  కానీ, తండ్రులు, తాతల నాటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మన రాష్ట్రంలో చాలా వరకు వదిలేశాం. కర్నాటక, మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఇప్పటికీ పట్టుదలగా సేంద్రియ సాగు కొనసాగిస్తున్నారు. పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం, బీజామృతం వంటి వాటిల్లో పేడను విరివిగా వాడుతున్నారు.
 - డా. అంకిరెడ్డి ఓబిరెడ్డి (ankireddyobi@yahoo.co.in),
 విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, జాతీయ పాడి పరిశోధనా సంస్థ, బెంగళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement