నాగర్‌కర్నూల్: శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ పోరుపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం యంత్రాగాన్ని సమాయత్తపరుస్తోంది. ఇందులో భాగంగా పోలింగ్ సిబ్బంది వివరాలను సమర్పించాల్సిందిగా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వివరాలు ఈ నెల 30లోగా టీ–పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి వివరాలను అధికారులు యాప్‌లో పొందుపరుస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2019 ఎన్నికల స్థానాలకు రిజర్వేషన్లు పదేళ్ల పాటు వర్తిస్తాయని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలో ఎస్టీలకు 318 గ్రామపంచాయతీలు, ఎస్సీలకు 295, బీసీలకు 355, జనరల్ అభ్యర్థులకు 716 గ్రామపంచాయతీలను రిజర్వేషన్లు వర్తింపజేసింది. ఇందులో సగం మహిళలకు కేటాయించారు.
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక ఏమైనా మార్పులు చేస్తుందా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. షెడ్యూల్ ఏరియాలోని పంచాయతీల్లో వందశాతం ఎస్టీలకు రిజర్వేషన్ వర్తిస్తోంది. ఒక వేళ చట్టంలో మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రస్తుత చట్టాన్ని మార్చాలి.
ఇది జరగాలంటే మరో కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఆపై ఆమోదం పొందాలి. ఇంత ప్రక్రియ జరగాలంటే మరింత సమయం పడుతుంది. మరోవైపు పాలకవర్గాల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియను కమిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత సమయం లేదు. ఆయా పరిణామాల నేపథ్యంలో స్థానిక సంగ్రామం సకాలంలో జరగకపోవచ్చు అనే అభిప్రాయం అధికారులు, రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అమలులోకి రావడం అనివార్యమవుతుంది.
బ్యాలెట్ పోరు..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే దాన్ని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించాల్సి ఉంటుంది. కొత్తగా అభ్యంతరాలు, స్వీకరణ, పరిశీలన జరిపి తుది జాబితా వెల్లడించడం తప్పనిసరి. ఈ ప్రక్రియకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్నికల విభాగం అధికారులు చెబుతున్నారు.
శాసనసభ ఎన్నికల జాబితాల్లో దొర్లిన తప్పుల సవరణకు సంబంధించి ఓటర్లకు అవకాశం ఇవ్వాలి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పంచాయతీ పోరుకు తుది ఓటరు జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసే వీలుంది. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పెట్టెలు సేకరించాలి. బ్యాలెట్ పత్రాలను ముద్రించాలి. ఇదంతా జరగాలంటే ఇప్పుడున్న సమయం కూడా చాలదన్న అభిప్రాయం ఎన్నికల అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ కోణంలో చూసి ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అనే వాదన వినిపిస్తోంది.
ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్‌ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు..
Comments
Please login to add a commentAdd a comment