సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరిజవహర్‌లాల్
సాక్షి, విజయనగరం : జిల్లా కేంద్రమైన విజయనగరం నగర పాలక సంస్థ ప్రక్షాళనకు కలెక్టర్, ప్రత్యేకాధికారి డా.ఎం.హరిజవహర్‌లాల్ శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల కిందట ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సోమవారం సంస్థ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. విభాగాల వారీగా వారు నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని రానున్న ఆరునెలల కాలానికి వారు చేయాల్సిన పనులపై స్పల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించారు. పనిచేయని వారిని పంపించేస్తానని హెచ్చరించారు.
నగరపాలక సంస్థకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయం, రెవిన్యూ వసూళ్లు తదితర అంశాలపై చర్చించారు. పట్టణంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై సమీక్షించారు. వీధులు, రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. పట్టణంలోని పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారి గాంధీకి సూచించారు. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారంలో భాగంగా భూగర్భ జలాల పెంపుదలపై దష్టి సారించాలన్నారు. జలసంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.
మున్సిపాలిటీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల నమోదుకు ఒక రిజిష్టర్ నిర్వహించాలని ఆదేశించారు.పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆక్రమణలు తొలగించాలని సూచించారు. బుచ్చెన్న కోనేరుతోపాటు ఎన్‌సీఎస్ థియేటర్ వెనుక భాగంలోని చెరువు, ప్రేమసమాజం ఎదురుగా ఉన్న చెరువులను పునరుద్ధరించాలని స్పష్టంచేశారు. నగరంలోని పలు కూడళ్లను ట్రాఫిక్ పరంగా అభివృద్ధిచేసి వాటిని సుందరీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వర్మ, సహాయ కమిషనర్ కనకమహాలక్ష్మి, వైద్యాధికారి డా.ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment