ప్రత్యామ్నాయంతో రైతుకు భరోసా
– వ్యవసాయశాఖ కమిషనర్ ఎం.హరిజవహర్‌లాల్ వెల్లడి
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో ప్రధాన పంటల సాగుకు అదను మీరిపోవడంతో ఇక ప్రత్యామ్నాయంతో రైతులకు భరోసా కల్పించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామని వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వ్యవసాయశాఖ జేడీఏలు, డీడీఏలు, డాట్ సెంటర్, కేవీకే, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు సమావేశమై ఖరీఫ్ పంటల సాగు, వాటి స్థితిగతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై సమీక్ష నిర్వహించారు.
కమిషనర్‌తో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎన్వీ నాయుడు, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ అధిపతి డాక్టర్ బి.గోపాలరెడ్డి, హైదరాబాద్ మెట్ట పరిశోధనా కేంద్రం(క్రీడా) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కేవీ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా జిల్లాల్లో ఖరీఫ్‌లో పంటలు సాగులోకి రాలేదన్నారు. 13 జిల్లాల పరిధిలో సాధారణ సాగు లక్ష్యం 42 లక్షల హెక్టార్లు కాగా.. ప్రస్తుతానికి 14.07 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయన్నారు. వర్షాధార ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల హెక్టార్లలోపు పంటలు మాత్రమే సాగులోకి వచ్చాయన్నారు.
కొన్ని జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. రాయలసీమ జిల్లాలు బాగా వెనుకబడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతాలు, జిల్లాల వారీగా నేలలు, రకాలు, వాతావరణం, వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ సంవత్సరం 20.44 లక్షల మంది రైతులకు భూసార పత్రాలు పంపిణీ చేయగా, అందులో సిఫారసుల మేరకు ఉచితంగా సూక్ష్మపోషకాలు అందజేస్తున్నామని తెలిపారు. వారంలోగా అన్ని జిల్లాలలో ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.