- రిటర్నింగ్ అధికారులతో సమావేశం
- ఎన్నికల కసరత్తు ప్రారంభం
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఎన్నికల విధులను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.రఘునందనరావు పేర్కొన్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వుతున్న నేపథ్యంలో కలెక్టర్ కసరత్తు చేపట్టారు. ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ప్రథమ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులపై ఉందన్నారు. ఖర్చుల పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్‌కు ముందు, పోలింగ్ జరిగేరోజు ఏర్పాట్లు, స్టాట్యూటరీ, లాజెస్టిక్స్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ జారీచేసిన వివరాలను వెబ్‌సైట్ నుంచి తీసుకోవాలని సూచించారు. ఖర్చుల పర్యవేక్షణకు సంబంధించి అదనపు జాయింట్ కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా విధులను నిర్వర్తిస్తారన్నారు.
రిటర్నింగ్, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ బూత్‌లను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి నివేదికను పంపాలని కోరారు. పోలింగ్‌బూత్‌లలో నియోజకవర్గ సంఖ్య, పోలింగ్ బూత్ సంఖ్య స్పష్టంగా ఉండేలా పెయింటింగ్ చేయించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల విషయమై తనిఖీ చేసుకోవాలన్నారు. ఓటర్ల జాబి తాను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా చూడాలని తహశీల్దార్లను ఆదేశించారు.
ఓటర్లను చైతన్యపరచండి
ఓటర్లను చైతన్యపరిచి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా చూడాలని కలెక్టర్ రఘునందనరావు కోరారు. పోలింగ్ బూత్‌లలో బీఎల్‌వోలుగా వీఆర్వో, వీఆర్‌ఏ, మండల స్థాయి సిబ్బందిని ముందుగా నియమించాలని, అవసరమైన సందర్భంలో ఇతర శాఖ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
గ్రామస్థాయిలో విజిలెన్స్ కమిటీలు
ఎన్నికల్లో నిజమైన ఓటరే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా గ్రామస్థాయిలో తటస్థంగా ఉండే నలుగురు లేక ఐదుగురు సభ్యులతో విజి లెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ రఘునందనరావు సూచించారు. గ్రామ పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగులు, రైతులు, యువకులు, మహిళలు తదితరులు ఇందులో సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జారీచేసిన ఉత్తర్వులను పూర్తిగా అవగాహనచేసుకోవాలని సూచించారు. ఉడా వీసీ పి.ఉషాకుమారి, విజయవాడ మునిసిపల్ కమిషనర్ సి.హరికిరణ్, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, సబ్ కలెక్టర్ డి.హరిచందన, నూజివీడు సబ్ కలెక్టర్ చక్రధరరావు, డీఆర్వో విజయచందర్ పాల్గొన్నారు.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే కఠిన చర్యలు
ఎన్నికల నిబంధనల ప్రకారం తహశీల్దార్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ రఘునందనరావు ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన విడిగా తహశీల్దార్లతో సమావేశమయ్యారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, తహశీల్దార్లు ప్రతి క్షణం తమ సెల్‌ఫోన్లు అందుబాటులో ఉండాలని ఫోన్లు స్విచాఫ్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి అతి ముఖ్యమైన ఆదేశాలను ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపుతామన్నారు.