విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం
విమానాశ్రయం (గన్నవరం) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుతో కలిసి చంద్రబాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.10 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు.
విమానాశ్రయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, ఎస్పీ ప్రభాకరరావు, ఉడా వైస్ చైర్మన్ ఉషాకుమారి, జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ జి.వి.రమణరావు, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధరరావు, డీసీపీ రవిప్రకాష్, టీడీపీ నాయకులు పలువురు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ద్వారకాతిరుమలకు బయలుదేరి వెళ్లారు.
రుణాలు మాఫీ చేసితీరుతాం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు అన్నిం టిని మాఫీచేసి తీరుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం మంత్రి ఉమా విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా, వారు గతంలో తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు కొత్త రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రుణమాఫీపై ప్రభుత్వం నియమిం చిన కోటయ్య కమిటీ తన నివేదిక అందజేయగానే స్పష్టమైన విధివిధానాలను ప్రకటిస్తామని ప్రకటిం చారు. రుణమాఫీపై రిజర్వు బ్యాంక్ గవర్నర్‌తో పాటు ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రితో కూడా తమ ప్రభుత్వం సంప్రదిం పులు జరుపుతోం దని, మరో రెండు రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాల కోసం రైతులను బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
జిల్లాలో తాగునీటి అవసరాలు నిమిత్తం సాగర్ నుంచి విడుదల కావాల్సిన పది టీఎంసీలకు ఇప్పటికే ఏడు టీఎంసీల నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. మిగిలిన నీటిని కూడా విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర జలబోర్డులతో సంప్రదింపులు జరిపి నీటి విడుదలకు ముఖ్యమంత్రిస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.