వార్షిక రుణ ప్రణాళిక రూ. 10,107.08 కోట్లు
- సకాలంలో రుణాలివ్వండి
- రుణాల రీషెడ్యూల్‌కు పూర్తి సమాచారమిస్తాం
- ప్రతీ కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ తెరవాలి
- బ్యాంకర్లకు కలెక్టర్ సూచన
- 40వేల మందికి రుణ అర్హత కార్డులు
విజయవాడ : ప్రభుత్వ పథకాలకు సకాలంలో రుణాలు అందించటంలో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. రఘునందనరావు బ్యాంకర్లను కోరారు. జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో నిర్వహించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికపై చర్చించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను ఆర్థికంగా అభివృద్ధిపరచడానికి ప్రారంభించే యూనిట్ల స్థాపనకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకర్లను కోరారు. వ్యవసాయ రంగంలో రుణాలను రీషెడ్యూలు చేయడానికి బ్యాంకర్లకు పూర్తి డేటాను అందిస్తామని, జిల్లాలో నూతనంగా 40 వేల మందికి రుణ అర్హత కార్డులను జారీచేశామన్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబానికీ ఖాతాలను తెరవాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు.
10,107.08 కోట్లతో 2014-15 వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం
2014-15 సంవత్సరానికి గాను 10,17,986 మందికి వివిధ పథకాల కింద వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా 10 వేల 107 కోట్ల మేరకు రుణాలను అందించాలని బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించి ఆమోదించారు. క్రాప్‌లోన్ నిమిత్తం 6,18,018 మంది రైతులకు 3659.27 కోట్ల రూపాయలతో ప్రణాళికను రూపొందించ గా.. ఇప్పటివరకూ 90,688 మందికి రూ.604.63 కోట్లను రుణాలుగా అందించినట్లు బ్యాంకర్లకు లీడ్ బ్యాంకు మేనేజర్ ఆర్‌వి నరసింహారావు వివరించారు.
వ్యవసాయ రుణాల రద్దు ప్రకటనవల్ల రికవరీ శాతం తగ్గిందని, ప్రభుత్వం ఈ విషయంలో నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీచే యటంతో త్వరలోనే వసూళ్లు పెరిగే అవకాశం వుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 28,783 మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతంలో రూ.1036.67 కోట్లకుగాను ఇప్పటివర కు 95.16 కోట్ల రూపాయలను అందించామన్నారు.
పట్టణ ప్రాంతంలో 92 కోట్లకుగాను 19.30 కోట్లను.. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 140 కోట్లకు గాను 12కోట్ల రూపాయల రుణాలను అందించామన్నారు. రిజర్వు బ్యాంకు ప్రతినిధి ఏఎన్‌వి కామేశ్వరరావు, ఆంధ్రా బ్యాంకు డీజీఎం జీఎన్‌వీ కృష్ణారావు, సప్తగిరి బ్యాంకు ఆర్‌యం సత్యనారాయణ, నాబార్డు ఏజీయం మధుమూర్తితోపాటు వివిధ బ్యాంకర్లు పాల్గొన్నారు.