కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పరిష్కారం కాని అంశాలైతే అర్జీదారులకు వెంటనే తెలపాలని ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ శివశంకర్, డ్వామా పీడీ అనిల్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కల్యాణం, రాజీవ్ విద్యామిషన్ పీవీ పి.పద్మావతి, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, డీసీవో రమేష్‌బాబు, డీఎస్‌వో పి.బి.సంధ్యారాణి, మెప్మా పీడీ హిమబిందు, ఐసీడీఎస్ పీడీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు ఇవీ..
ఘంటసాల మండలం అచ్చెంపాలెంలోని ఆయకట్టుకు దాళ్వా పంట వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కె.రామచంద్రరావు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
2012-13 విద్యాసంవత్సరానికి సంబంధించి తమకు వెంటనే స్కాలర్‌షిప్పులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల వసతి గృహంలో ఉండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
తమ గ్రామంలో పలువురు అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని, దీనివల్ల పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లుతోందని కోడూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన కొల్లి వెంకటసుబ్బయ్య, అప్పారావు ఫిర్యాదుచేశారు.
తమ గ్రామంలోని చౌకధరల దుకాణం డీలర్ కార్డుదారులకు సక్రమంగా సరుకులు ఇవ్వడంలేదని, చనిపోయిన వారి పేరు మీద ఉన్న కార్డుల సరుకులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామానికి చెందిన తమ్ము ఆంజనేయులు, సత్యరాజు తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. డీలర్‌పై చర్యలు తీసుకుని, తమకు సక్రమంగా సరుకులు అందించేలా చూడాలని కోరారు.
అంగన్‌వాడీ టీచర్ ఎస్సీకాలనీకి చెందిన చిన్నారులను పలకతో కొట్టి గాయపరుస్తున్నారని, అడిగితే సరైన సమాధానం చెప్పడంలేదని గూడూరు మండలం ఆకుమర్రు గ్రామానికి చెందిన కె.మురళీకృష్ణ ఫిర్యాదుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 23న విడుదల చేసిన జీవో 5,235 ద్వారా పౌరసంబంధాలశాఖ డెప్యూటీ డెరైక్టర్ కార్యాలయాన్ని జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త జం పాన శ్రీనివాసగౌడ్ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
మచిలీపట్నం 27వ వార్డులోని ప్రజల కోసం రుద్రవరం పరిధిలో శ్మశానవాటిక ఏర్పాటుచేసినా, దారి సౌకర్యం లేదని మాజీ కౌన్సిలర్ కొక్కిలిగడ్డ శరత్‌కుమార్ అధికారులకు వివరించారు. దారి సౌకర్యం కల్పించడంతోపాటు, శ్మశానానికి ప్రహరీ నిర్మించాలని విజ్ఞప్తిచేశారు.
అనూహ్య మృతికి రెండు నిమిషాల మౌనం
సాఫ్ట్‌వేర్ ఇంజినీరు శింగవరపు ఎస్తేరుఅనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన సంఘటనకు సంతాపంగా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రఘునందనరావుతో పాటు జిల్లా అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై గౌరవభావం పెంపొందేలా రాబోయే కాలంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.