ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారు? మీ దగ్గర ఉన్న వ్యవస్థ ఏంటి?
సమీక్షలో అధికారులపై డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నల వర్షం
అంశాల వారీగా అధికారులకు మార్గదర్శనం
అవకాశమున్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని ఆదేశాలు
మూడునెలలకోసారి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరిస్తున్నారని, ఈ దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల వద్ద ఉన్న వ్యవస్థ ఏమిటని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారుల స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సచివాలయంలో ప్రజావాణి దరఖాస్తులపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డితో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి.. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు, ఏయే శాఖల వారీగా వచ్చాయి, ఎన్ని పరిష్కరించారన్న దానిపై అధికారులను అడిగారు. ప్రతి దరఖాస్తును పరిష్కరించే క్రమంలో అసలేం జరుగుతుందని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
ఇందుకు నోడల్ అధికారిణి దివ్య దేవరాజన్ సమాధానమిస్తూ, తొలుత ఫిర్యాదు రాగానే దరఖాస్తుదారుని మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ పంపుతామని, ఆ తర్వాత పరిష్కారం అయిన వెంటనే ఎస్‌ఎంఎస్ ద్వారానే సమాచారమిస్తామని వెల్లడించారు. అయితే, సదరు దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే వ్యవస్థ లేదని, ఈ నేపథ్యంలో అలాంటి వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు..
ప్రజావాణిలో భాగంగా కొత్త రేషన్‌కార్డుకోసం దరఖాస్తులు, పింఛన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని అధికారులు డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు. దీనిపై స్పందించిన భట్టి మాట్లాడుతూ.. రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, త్వరలోనే నిర్ణయం తీసుకుని కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. కొత్త పింఛన్లను కూడా త్వరలోనే మంజూరు చేసే అవకాశముందన్నారు.
మహిళలకు కేవలం కుట్టుమెషీన్లు ఇస్తే సరిపోదని, శిక్షణ కూడా ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ డెసు్కలను బలోపేతం చేయాలని, తద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పారు. జీరో విద్యుత్ బిల్లులు జారీ చేసే మండలస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వెల్లడించారు.
అవసరమైతే పాలసీ మార్చుకుందాం
ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల్లో పరిష్కారానికి అవకాశమున్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే రాతపూర్వకంగా నివేదిస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
ప్రతి మూడు నెలలకోసారి ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య కోరగా, ఇందుకు స్పందించిన భట్టి తగినవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతు నుంచి అభినందన లేఖ..
ప్రజావాణిలో వచి్చన ఫిర్యాదులను వీలున్నంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని నోడల్ అధికారి దివ్య వెల్లడించారు. తన వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు వేలాడుతున్న విషయాన్ని ప్రజావాణి ద్వారా మహబూబ్‌నగర్‌కు
చెందిన రైతు ఫిర్యాదు చేయగా, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించామని, ఇందుకు అధికారులను అభినందిస్తూ ఆ రైతు లేఖ రాసిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టికి ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment