
మళ్లీ కొత్త రికార్డు... తొలిసారిగా 17వేలకు మించి నమోదు
ఎంత పెరిగినా నిరంతర సరఫరా చేస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం సాయంత్రం 4.39 గంటలకు గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకొని కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో విద్యుత్ డిమాండ్ 17వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. గతేడాది సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,557 మెగావాట్లే. గతేడాది మార్చి 8న నమోదైన 15,523 మెగావాట్ల గరిష్ట డిమాండే ఈ ఏడాది ప్రారంభం వరకు అత్యధికం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 5న డిమాండ్ 15,752 మెగావాట్లకు పెరిగి కొత్త రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ పలుమార్లు కొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుత నెలలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16వేల మెగావాట్లకు మించి నమోదవుతోంది. ఈ నెల 18న 335.19 మిలియన్ యూనిట్ల రోజువారీ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో సైతం గురువారం 11,017 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది.
డిమాండ్ ఎంత పెరిగినా కోతల్లేని సరఫరా
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, రెప్పపాటు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన సంస్కరణలు, రూపొందించిన ముందస్తు ప్రణాళికలతో పాటు విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి తీసుకున్న చర్యలతో ఇది సాధ్యమైందన్నారు.
ఒక్క వినియోగదారుడికి సమస్య రావొద్దు: సందీప్‌కుమార్‌సుల్తానియా
వేసవిలో ఏ ఒక్క వినియోగదారుడికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై గురువారం ఆయన సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ 30 శాతం పెరిగిందని అధికారులు వివరించారు.
గత వేసవి అనుభవాల దృష్ట్యా ఈ వేసవిలో ఓవర్ లోడ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పలు సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గరిష్ట డిమాండ్ 5,000 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశామని, ఆ మేరకు సరఫరాకు సిద్ధంగా ఉన్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment