మళ్లీ ఇసుక దందాలే.. | Dandale sand again .. | Sakshi
Sakshi News home page

మళ్లీ ఇసుక దందాలే..

Published Fri, Jan 10 2014 1:29 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

మళ్లీ ఇసుక దందాలే.. - Sakshi

మళ్లీ ఇసుక దందాలే..

=నేడు గనిఆత్కూర్ క్వారీకి లాటరీ
 =733 మంది టెండర్లలో ఒకరికే అవకాశం
 =త్వరలో తెరుచుకోనున్న మరో 20 రీచ్‌లు
 =పొరుగు జిల్లాలకు వెళ్లినవారంతా తిరుగుముఖం

 
 కాసులు కురిపించే ఇసుక క్వారీలకు డిమాండ్ పెరిగింది. గత కొంతకాలంగా మూతపడిన రీచ్‌లను తెరిచేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం గని ఆత్కూర్ క్వారీకి టెండరు ఖరారు చేయనుండగా, త్వరలో మరో 20 రీచ్‌లకు టెండర్లు పిలవనున్నారు. అనేక వివాదాలు, లాభాలు మిళితమైన ఇసుక క్వారీలను దక్కించుకునేందుకు మళ్లీ పోటీ పెరిగింది. దీంతో ఇసుక దందాలకు మరోమారు తెరలేచింది.  
 
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఇసుక రీచ్‌లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ ఎస్‌ఈ ఆధ్వర్యంలో భవానీపురం, సూరాయిపాలెం, ఇబ్రహీంపట్నం ఇసుక క్వారీలు తెరుచుకోగా తాజాగా కంచికచర్ల మండలం గనిఆత్కూర్ ఇసుక క్వారీ తెరిచేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరో 20 ఇసుక క్వారీలు తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వేలం పాటల ద్వారా ఇసుక క్వారీలు ఖరారు చేస్తే ఈసారి టెండర్లు స్వీకరించి లాటరీ పద్ధతిలో ఖరారు చేస్తున్నారు.  
 
ఒక క్వారీ.. 733 టెండర్లు...
 
గనిఆత్కూర్ క్వారీకి టెండర్లు పిలవగా దానిని దక్కించుకునేందుకు 733 టెండర్లు దాఖలయ్యాయి. సీనరేజ్‌తో కలిపి క్యూబిక్ మీటర్‌కు రూ.450 ధరను జిల్లా కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. టెండర్లు వేసినవారిలో ఒకే ఒకరిని శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. గతంలో పంచాయతీరాజ్ విభాగంలో ఉండగా బందరులో ఇసుక క్వారీలను ఖరారు చేసే ప్రక్రియ జరిగేది. మైనింగ్ శాఖకు అప్పగించిన అనంతరం ఇటీవల విజయవాడలోనే ఇసుక క్వారీలకు వేలం పాటలు నిర్వహించే పద్ధతి జరుగుతోంది. తాజాగా లాటరీ పద్ధతిని జిల్లా అంతటా కలెక్టరేట్ వద్ద నిర్వహించేలా కలెక్టర్ ఎం.రఘునందనరావు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
 
మరో 20 క్వారీలు తెరిచేందుకు చర్యలు...
 
జిల్లాలో ప్రస్తుతం ఒక రీచ్‌కి లాటరీ నిర్వహిస్తున్న అధికారులు మరో 20 ఇసుక క్వారీలు తెరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కృష్ణానది పరీవాహక ప్రాంతంలోను, పశ్చిమ, తూర్పు కృష్ణా ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పర్యావరణ శాఖ అనుమతి వచ్చిన వెంటనే జిల్లాలోని 20 క్వారీలకు దరఖాస్తులు స్వీకరిస్తామని డ్వామా పీడీ కె.అనిల్‌కుమార్ ‘సాక్షి’కి వివరించారు. వీటికి లాటరీ ప్రక్రియ మరో 20 రోజుల్లో పూర్తికావచ్చని జిల్లా అధికారులు చెబుతున్నారు.
 
జిల్లా బాట పట్టనున్న నిర్వాహకులు...
 
జిల్లాలో ఇసుక క్వారీలు మూతపడటం, వేలం పాటలు పలుమార్లు వివాదాస్పదం కావడం, న్యాయపరమైన సమస్యలు ఎదరుకావడంతో ఇక్కడ పరిస్థితి సానుకూలంగా లేదని భావించిన జిల్లాకు చెందిన ఇసుక క్వారీల నిర్వాహకులు పొరుగు జిల్లాలైన గుంటూరు, ఉభయగోదావరి వెళ్లారు. అక్కడ స్థానికంగా పరిస్థితులు అనుకూలించడంతో ఇసుక రీచ్‌లను అధిక ధరలకు టెండర్లు వేసి దక్కించుకున్నారు. తాజాగా జిల్లాలోనే ఇసుక రీచ్‌లకు అనుమతి ఇస్తుండటంతో క్వారీల నిర్వాహకులు అంతా మళ్లీ వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement