మా జీవధారకు మేమే రక్ష | Moram villagers chase away illegal sand miners | Sakshi
Sakshi News home page

మా జీవధారకు మేమే రక్ష

Published Mon, Nov 25 2024 5:09 AM | Last Updated on Mon, Nov 25 2024 5:09 AM

Moram villagers chase away illegal sand miners

ఇసుక అక్రమ తవ్వకందారులను తరిమేసిన మొరం గ్రామస్తులు  

3 నెలలుగా చెరువును చెరబట్టి తవ్వేస్తున్న టీడీపీ నేతలు

చెరువులో 20 నుంచి 30 అడుగుల లోతున తవ్వకాలు 

ఇప్పటికే 5 వేలకుపైగా ట్రాక్టర్ల ఇసుక తరలింపు 

పలమనేరు: అధికారం అండతో సహజవనరుల దోపి­డీకి తెగబడ్డ తెలుగుదేశం నేతలు సాగునీటి చెరువునూ చెరబ­ట్టారు. ఐదువేల ట్రాక్టర్ల ఇసుకను యథేచ్ఛగా తోడేశారు. కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. తమ జీవనా­ధారమైన చెరువులో 20 నుంచి 30 అడు­గుల లోతున తవ్వు­తుండటాన్ని తట్టుకోలేని గ్రామ­స్తులు ప్రశ్నిస్తే దిక్కు­న్నచోట చెప్పుకోమన్నారు. ఒక్కొ­క్కరుగా ప్రశ్నిస్తే అక్రమా­ర్కు­లు బెదిరిస్తుండటంతో గ్రామస్తులంతా ఏకమ­య్యారు. నెలల తరబడి సాగు­తున్న ఈ దోపిడీని కలిసి­కట్టుగా అడ్డుకున్నారు. 

గ్రామ­స్తుల ఐక్యత చూసి అక్రమా­ర్కులు జేసీబీలు, ట్రాక్టర్లతో సహా పలాయనం చిత్తగించారు. ఇక చెరువును తామే రక్షించుకుంటామని గ్రామ­స్తులంతా ప్రతిన­బూనారు. ఈ ఐక్యత సాధించిన ఫలితం పలు గ్రామాల ప్రజలను ఆలోచింపజేస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు మండ­లంలోని మొరం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం. 133లో 93.94 ఎకరాల విస్తీర్ణంలో పెద్దచెరువు ఉంది. ఈ చెరువు కింద 91 ఎకరాల ఆయకట్టు ఉంది. 

ఈ చెరువు ఆధారంగానే మొరం గ్రామంలో 150 కుటుంబాలు, తొప్పనపల్లిలో 80, రామాపు­రంలో 40, చిన్న­పేట కురప్పల్లిలో 60 కుటుంబాలు వ్యవసాయం చేసు­కుంటూ జీవిస్తున్నాయి. ఈ చెరువు వల్లే.. ఆ పరిసరా­ల్లో ఉన్న దాదాపు 600 వ్యవ­సాయ బోర్లలో ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ నేతల కన్ను ఆ చెరువుపై పడింది. కొందరు నేత­లు ఇసుక తవ్వుకునేందుకు చెరువును పంచుకున్నారు. 

మూడు నెలలుగా రోజూ ఐదు జేసీబీలతో ఇసుక­ను తవ్వి 22 ట్రాక్టర్లలో రేయింబవళ్లు తరలించారు. చెరువుకు సమీపంలోని మామిడి­తోపులు, ఆయా నేతల పొలాలు, అడవులు, రహస్య ప్రదేశాల్లో ఇసుకను డంప్‌చేసి, రాత్రిళ్లు అక్కడి నుంచి కర్ణాటకకు తరలించి అమ్ముకున్నారు. చెరువులో దాదాపు 40 ఎకరాల విస్తీ­ర్ణంలో 20 నుంచి 30 అడుగుల లోతున తవ్వి ఐదువేలకుపైగా ట్రాక్టర్ల ఇసుకను అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు.

అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో..
చెరువు సర్వనాశనం అవుతోందని ఆవేదన చెందిన గ్రామస్తులు ఈ అక్రమాలను ఆపాలని అధికారులకు విన్నవించుకున్నారు. కానీ అధికార పార్టీ నేతలే ఈ అక్రమాలకు పాల్పడుతుండటతో అధికారులు ఇసుక తవ్వ­కాలను అడ్డుకోలేదు. తమ చెరువును తామే రక్షించు­­కోవాలని నిర్ణయించుకున్న గ్రామస్తులంతా ఏకమ­య్యారు. అందరూ కలిసి ఆదివారం చెరువు వద్దకు వెళ్లి ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. 

జేసీబీలను, తరలి­స్తున్న ట్రాక్టర్లును అక్కడి నుంచి పంపేశారు. ఇసు­కాసురులు, గ్రామ­స్తుల మధ్య వాగ్వాదాలు జరి­గాయి. ఈ అక్ర­మా­లపై తాము స్థానిక ఎమ్మెల్యే అమర­నాథరెడ్డికే ఫిర్యాదు చేస్తామంటూ గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడే వీఆ­ర్వోకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న వీఆర్వో రమేష్‌ ఇసుకాసురులను పంపేశారు. ఇసుక ఉచితమనే పాలసీ ఉంటే అవరస­మైనవారు సంబంధిత శాఖల ద్వారా అను­మతి తీసుకోవాలిగానీ, ఇలా వ్యాపా­రాలు చేయడం తప్పని హెచ్చరించారు. 

ఇకపై ఎవరైనా అనుమతి లేకుండా చెరువులో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు పట్టించుకోకపోయినా.. తమ చెరువులోకి ఇసుక తవ్వకాలకు ఎవరైనా వస్తే అనుమతించబోమని గ్రామస్తులు తెగేసి చెప్పారు. ఈ ఘట­నతో పరిసర ప్రాంతాలవారు తమ గ్రామాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement