- ‘గంటా’ హయాంలో రైతులకు కడగండ్లు
- రెచ్చిపోయిన ఇసుక మాఫియా
- సాగునీటి ఆనకట్టను పేల్చివేసిన వైనం
- కనీస స్థాయిలో స్పందించని అమాత్యుడు
- రైతుల్లో కట్టలు తెగుతున్న ఆగ్రహం
తుమ్మపాల, న్యూస్‌లైన్: ఏడాదికో పార్టీ, పార్టీకో నియోజకవర్గం మార్చే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా తన అయిదేళ్ల కాలంలో అనకాపల్లి రైతాంగానికి కడగండ్లనే మిగిల్చా రు. రైతులకు ఆయన మేలు చేయకపోగా తీరని ద్రోహాన్ని చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైతాంగానికి అండగా ఉంటానని గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు గుప్పించిన గంటా ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి గోరంత కాగా, కొండంత ప్రచారం చేసుకుంటూ శంకుస్థాపనలు, పర్యటనలకే పరిమితమయ్యారన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
ఇసుక మాఫియా రాజ్యం
గంటా శ్రీనివాసరావు హయాంలో ఇసుక మాఫియాకు అడ్డేలేకుండా పోయింది. అడిగే ధైర్యం లేకపోవడంతో మండలంలో మాఫి యా పెట్రేగిపోయింది. రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖల అధికారులు చోద్యం చూడడంతో వారి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తమ అక్రమ రవాణాకు ఆటంకంగా మారిందన్న ఉద్దేశంతో మండలంలోని తగరంపూడి, దిబ్బపాలెం గ్రామాల మధ్య ఉన్న ఆనకట్టను 2011, ఫిబ్రవరి 27న పేల్చేశారంటే ఇసుక మాఫియా ఆగడాలు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిం చింది. అయినా గంటాకు చీమకుట్టినట్లయినా లేకపోవడంతో స్థానిక రైతులు ఆయనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నమ్మక ద్రోహి అంటూ బహిరంగంగా విమర్శించిన ఘటన లు కోకొల్లలు.
ఎంత ధైర్యం
సీతానగరం ప్రాంతంలోని ఇసుకను దాదాపు రూ.23 లక్షలకు అనధికారికంగా అప్పట్లో ఓ వ్యక్తి వేలం పాడుకున్నారు. ఈ ఆనకట్టను పేల్చివేస్తే ఎగువన ఉన్న ఇసుకను కూడా రాబట్టుకుందామనే దురుద్దేశం ఆయనకు కలిగింది. అంతే ఎమ్మెల్యే అండ, అధికారులు అడగరన్న ధైర్యంతో ఆనకట్టను పేల్చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తుమ్మపాల ఆనకట్ట పేల్చివేతపై విచారణ చేయించి రైతులకు మేలు చేయాల్సిన గంటా తూతూమంత్రంగా పర్యటించి వెళ్లిపోవడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగి దాదాపు మూడేళ్లు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరు పేల్చివేతకు పాల్పడ్డారనే విచారణ జరగలేదు. అధికారులపై ఒత్తిడులే ఇందుకు కారణమని నేటికీ రైతులు విమర్శిస్తున్నారు.
సాగునీరు ప్రశ్నార్థకం
తుమ్మపాల ఆనకట్ట కింద మండలంలోని తుమ్మపాల, మార్టూరు, బవులవాడ, రేబాక, శంకరం, రాజుపాలెం, గొర్లివానిపాలెం, కొప్పాక, కొత్తూరు గ్రామాల పరిధిలోని 1680 హెక్టార్ల ఆయకట్టు ఉంది. అలాగే ఈ ఆనకట్ట నుంచి వచ్చే అదనపు నీటితో అనకాపల్లి, మునగపాక మండలాల్లోని సిరసపల్లి, మూలపేట, గవర్లఅనకాపల్లి, మునగపాక గ్రామాలకు చెందిన 1580 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మిగులు నీరు అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో కృష్ణంరాజు కాలువ ద్వారా మరో ఐదువేల ఎకరాలకు అందుతుంది.
ఈ విధంగా వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆనకట్టను పేల్చివేయడం ద్వారా ఇసుక మాఫియా రైతులకు తీరని అన్యాయం చేసినా మంత్రిగా గంటా శ్రీనివాసరావు ఇసుమంతైనా స్పందించలేదన్న విమర్శ ఉంది. సాగునీరు అందక రైతులు లబోదిబోమంటున్నారు. సక్రమంగా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో మూడు పంటలు పండించుకునే స్థితిలో రైతులు లేరు. తుమ్మపాల ఫ్యాక్టరీ ఆధునీకరణ, చెరకు రైతులకు మద్దతు ధర కల్పించడంలోను గంటా విఫలమయ్యారు.
తుమ్మపాలలోని ఊరకాలువ అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ పనులు చేపట్టడంలో ఎమ్మెల్యేగా, మంత్రి హోదాలో కూడా దృష్టిసారించక పోవడం పట్ల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.