సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలో భవన నిర్మాణరంగంలో సంక్షోభం సృష్టిస్తున్న ఇసుక సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. నగరానికి అవసరమైన మేరకు ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు అంగీకరించారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో విశాఖతో పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి మంగళవారం సమీక్షించారు. సమావేశానంతరం భేటీ వివరాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
విశాఖ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నిర్మాణ రంగ అవసరాల కోసం 11 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని, ప్రస్తుతం 1.59 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందన్నారు. దీనివల్ల నిర్మాణ రంగానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని, తద్వారా వేలాదిమందికి ఉపాధి లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు, విజయనగరం జిల్లా నుంచి 2 లక్షల క్యూబిక్ మీటర్లు, తూర్పుగోదావరి నుంచి ప్రస్తుతం రోజుకు 1500ల క్యూ బిక్ మీటర్లు వరద ప్రవాహం తగ్గిన తర్వాత రోజుకు ఐదు వేల క్యూబిక్ మీటర్ల చొప్పున సరఫరా చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు అంగీకరించారన్నారు. ఇసుక సమస్య పరి ష్కారం కోసం రీచ్‌ల వద్ద రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపేం దుకు అనుమతినివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
నోడల్ ఏజెన్సీగా కలెక్టర్
ఇక నుంచి ఇసుక సరఫరాపై నోడల్ ఏజెన్సీగా విశాఖ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు. విశాఖ కలెక్టర్ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు ఇసుక సరఫరా చేస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుకను జీవీఎంసీ, వ్యక్తిగత అవసరాల కోసం వినియోగిస్తారని చెప్పారు. భద్రాచలం సమీపంలో రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్లు చెప్పారని మంత్రి తెలిపారు. క్రెడాయ్ తదితర సంస్థలు అక్కడ నుంచి రవాణా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
నగరంలో ఇసుక సరఫరా అంశంపై నిరంతర నిఘా.. సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు డాక్టర్ ఎన్.యువరాజ్, పి.లక్ష్మీనరసింహం, ఎంఎం నాయక్, హెచ్ అరుణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఆయా జిల్లాల డీఆర్‌డీఏ పీడీలు సత్యసాయి శ్రీనివాస్, డిల్లేశ్వరరావు, తనూజ రాణి తదితరులు పాల్గొన్నారు.
ఇక పొరుగు ఇసుక
Published Wed, Sep 23 2015 2:01 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement