Building Construction sector
-
విద్యుత్ ఆదా కోసం ‘బిల్డింగ్ కోడ్’!
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ రంగంలో విద్యుత్ ఆదా చర్యల ద్వారా పర్యావరణానికి మేలు చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే తీసుకువచ్చిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలను ఇస్తుండగా.. తాజాగా దానిని సవరిస్తూ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్‌బీసీ) పేరుతో కొత్త డ్రాఫ్ట్‌ను బీఈఈ రూపొందించింది. ఈ ముసాయిదాపై ఈ నెల 12లోగా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించాలని ప్రజలను, రాష్ట్రాలను బీఈఈ కోరింది. ఇది అమల్లోకి వస్తే కొత్తగా నిర్మించే వాణిజ్య–నివాస భవనాల్లో నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ పొదుపు చర్యలను పాటించాల్సి ఉంటుంది. ఏమిటీ ముసాయిదా.. ప్రపంచంలో విద్యుత్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాల్లో 39 శాతం భవన నిర్మాణ రంగం నుంచే వస్తోంది. అలాగే మొత్తం విద్యుత్ వినియోగంలో 36 శాతం భవనాల్లోనే జరుగుతోంది. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా 2030 నాటికి నిర్మాణ రంగ ఇంధన డిమాండ్‌ను 50 శాతం తగ్గించగల సామర్థ్యం ఈసీఎస్బీసీకి ఉందని బీఈఈ గుర్తించింది. ఇంజనీర్లు, డెవలపర్లు, నిర్మాణ సంస్థల సంయుక్త సహకారంలో దీనిని విజయవంతం చేయాలని బీఈఈ భావిస్తోంది. వనరుల సంరక్షణతో పాటు వ్యర్థాలు, కాలుష్యం, పర్యావరణ క్షీణతను తగ్గించడం, పగటిపూట సహజ వెలుతురు ప్రసరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముసాయిదాను తయారు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ని విభాగాలను భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. గృహ, పరిశ్రమ, వ్యవసాయం సహా అనేక రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది. భవనాల్లో దాదాపు 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది. స్కూళ్లు, ఆస్పత్రులు, టీటీడీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులతో పాటు వాణిజ్య భవనాలు, నివాస భవనాల్లో ఇంధన సంరక్షణను ప్రోత్సహించడం కోసం ఈసీబీసీని కూడా అమలు చేస్తోంది. ప్రభు త్వం ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా అందించింది. వ్యవసాయంలో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించి రైతులు, పంప్ టెక్నీషియన్లతో వివిధ అవగాహన సెషన్లను నిర్వహించింది. ఇటువంటి చర్యలతో గతేడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు–2023ను ఆంధ్రప్రదేశ్ అందుకుంది. ‘ఈసీబీసీ’లో ఏపీ ఆదర్శం వెయ్యికి పైగా భవనాల్లో ఈసీబీసీ అమలుతో పాటు 3 వేల మంది కంటే ఎక్కువ వాటాదారులకు శిక్షణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. వేగంగా అభివృద్ధి చెందుతూ.. విస్తరిస్తున్న విశాఖ వంటి నగరాల్లో ఈసీబీసీ అమలు వల్ల విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. నీటి వనరులు కూడా కలుషితం కావు. ఉత్పాదక రంగం వృద్ధి చెందుతుంది. భవన నిర్మాణ రంగంలో ఆవిష్కరణలు, పోటీతత్వం, గ్రీన్ ఉద్యోగాలు, నైపుణ్యాలు, సాంకేతికతలకు అవకాశాలు పెంచడంలో ఈ కోడ్ సహాయపడుతుంది. ఈ క్రమంలోనే విశాఖలో సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణాన్ని చేపట్టిన ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. – అభయ్ భాక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ -
లెక్క చూపని లావాదేవీలు రూ.800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున రియల్ ఎస్టేట్, భవన నిర్మాణరంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న మూడు ప్రముఖ కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, కర్నూల్, నంద్యాల, అనంతపూర్, బళ్లారి, తదితర ప్రాంతాల్లో ఈనెల 5న 24 బృందాలుగా సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ రూ.800 కోట్ల మేర లెక్క చూపని లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది. ఈ మేరకు ఐటీ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సోదాల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను గుర్తించినట్లు తెలుపగా, అందులో ప్రధానంగా చేతితో రాసిన లావాదేవీల బుక్కులు, అగ్రిమెంట్లు దొరికినట్లు వెల్లడించింది. అలాగే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లో దాచిన కొన్ని లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటపడ్డట్లు తెలిపింది. ఆదాయపు లెక్కలు చూపించని నగదు లావాదేవీల వివరాలను ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ఒక కంపెనీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నట్లు ఐటీ గుర్తించింది. ఈ మూడు సంస్థలు ఆస్తుల రిజిస్ట్రార్ విలువ కంటే అధిక మొత్తంలో నగదు స్వీకరించినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అలా అధికమొత్తంలో స్వీకరించిన నగదును భూముల కొనుగోలులో పెట్టుబడికి ఉపయోగించారంది. ఈ సోదాల్లో రూ.1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వివరించింది. -
ఇక పొరుగు ఇసుక
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలో భవన నిర్మాణరంగంలో సంక్షోభం సృష్టిస్తున్న ఇసుక సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. నగరానికి అవసరమైన మేరకు ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు అంగీకరించారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో విశాఖతో పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి మంగళవారం సమీక్షించారు. సమావేశానంతరం భేటీ వివరాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. విశాఖ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నిర్మాణ రంగ అవసరాల కోసం 11 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని, ప్రస్తుతం 1.59 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందన్నారు. దీనివల్ల నిర్మాణ రంగానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని, తద్వారా వేలాదిమందికి ఉపాధి లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు, విజయనగరం జిల్లా నుంచి 2 లక్షల క్యూబిక్ మీటర్లు, తూర్పుగోదావరి నుంచి ప్రస్తుతం రోజుకు 1500ల క్యూ బిక్ మీటర్లు వరద ప్రవాహం తగ్గిన తర్వాత రోజుకు ఐదు వేల క్యూబిక్ మీటర్ల చొప్పున సరఫరా చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు అంగీకరించారన్నారు. ఇసుక సమస్య పరి ష్కారం కోసం రీచ్‌ల వద్ద రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపేం దుకు అనుమతినివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నోడల్ ఏజెన్సీగా కలెక్టర్ ఇక నుంచి ఇసుక సరఫరాపై నోడల్ ఏజెన్సీగా విశాఖ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు. విశాఖ కలెక్టర్ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు ఇసుక సరఫరా చేస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుకను జీవీఎంసీ, వ్యక్తిగత అవసరాల కోసం వినియోగిస్తారని చెప్పారు. భద్రాచలం సమీపంలో రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్లు చెప్పారని మంత్రి తెలిపారు. క్రెడాయ్ తదితర సంస్థలు అక్కడ నుంచి రవాణా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నగరంలో ఇసుక సరఫరా అంశంపై నిరంతర నిఘా.. సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు డాక్టర్ ఎన్.యువరాజ్, పి.లక్ష్మీనరసింహం, ఎంఎం నాయక్, హెచ్ అరుణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలు సత్యసాయి శ్రీనివాస్, డిల్లేశ్వరరావు, తనూజ రాణి తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్, సిమెంట్ ధరలు పైపైకి
బాన్సువాడ రూరల్ : సిమెంట్, స్టీల్, ఇటుకల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ అప్పుచేసి సొంతిల్లు నిర్మించుకుందామనుకున్న సామాన్యుడి కల నెరవేరటం లేదు. అకాశాన్ని అంటుతున్న బిల్డింగ్ మెటీరియల్ ధరలతో సగంలోనే నిర్మాణాలు ఆగిపోతున్నాయి. బాన్సువాడలో నెలరోజుల క్రితం వరకు రూ. 200 ఉన్న బస్తా సిమెంట్ ధర ప్రస్తుతం రూ. 300కు చేరింది. సాధారణ ఇటుక ధరసైతం మొన్నటి వరకు వెయ్యికి రూ. 2,500 ఉండగా ప్రస్తుతం రూ. 3,000లకు చేరింది. స్టీలు క్వింటాలుకు రూ. 4,500 పలుకుతోంది. పెరిగిన ధరలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా సిమెంట్, ఇటుక, స్టీలు ధరలు పెరుగుతుండటంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టిన వారుకూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు ధరలు పెరుగిపోతూ ఉండటంతో పలువురు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలోనే గృహ నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో నిర్మాణాలు ప్రారంభించినవారు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలకు చేయాల్సిన ఖర్చు అంచనాలకు రెట్టింపు అవుతోందని భవన నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో సాధారణంగా గ్రామాల్లో పెంకుటిళ్లను మాత్రమే నిర్మించుకునేవారు. ఆర్సీసీ బిల్డింగ్‌ల నిర్మాణాలు అరుదుగా జరిగేవి. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా పెంకుటిళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్సీసీ భవనాల నిర్మాణాలు పెరిగాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కూడా మందగించాయి. ప్రభుత్వం స్పందించాలి.. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యుడికి సొంతింటి కల నెరవేరని పరిస్థితులు నెలకొంటాయి. సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సీఏం కేసీఆర్ వెంటనే కొత్తవారితోపాటు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారికి సైతం గృహ నిర్మాణానికి రూ. 3 లక్షలు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.