సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున రియల్ ఎస్టేట్, భవన నిర్మాణరంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న మూడు ప్రముఖ కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, కర్నూల్, నంద్యాల, అనంతపూర్, బళ్లారి, తదితర ప్రాంతాల్లో ఈనెల 5న 24 బృందాలుగా సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ రూ.800 కోట్ల మేర లెక్క చూపని లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది.
ఈ మేరకు ఐటీ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సోదాల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను గుర్తించినట్లు తెలుపగా, అందులో ప్రధానంగా చేతితో రాసిన లావాదేవీల బుక్కులు, అగ్రిమెంట్లు దొరికినట్లు వెల్లడించింది. అలాగే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లో దాచిన కొన్ని లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటపడ్డట్లు తెలిపింది. ఆదాయపు లెక్కలు చూపించని నగదు లావాదేవీల వివరాలను ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ఒక కంపెనీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నట్లు ఐటీ గుర్తించింది.
ఈ మూడు సంస్థలు ఆస్తుల రిజిస్ట్రార్ విలువ కంటే అధిక మొత్తంలో నగదు స్వీకరించినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అలా అధికమొత్తంలో స్వీకరించిన నగదును భూముల కొనుగోలులో పెట్టుబడికి ఉపయోగించారంది. ఈ సోదాల్లో రూ.1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment