సాక్షి, అమరావతి: భవన నిర్మాణ రంగంలో విద్యుత్ ఆదా చర్యల ద్వారా పర్యావరణానికి మేలు చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే తీసుకువచ్చిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలను ఇస్తుండగా.. తాజాగా దానిని సవరిస్తూ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్‌బీసీ) పేరుతో కొత్త డ్రాఫ్ట్‌ను బీఈఈ రూపొందించింది.
ఈ ముసాయిదాపై ఈ నెల 12లోగా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించాలని ప్రజలను, రాష్ట్రాలను బీఈఈ కోరింది. ఇది అమల్లోకి వస్తే కొత్తగా నిర్మించే వాణిజ్య–నివాస భవనాల్లో నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ పొదుపు చర్యలను పాటించాల్సి ఉంటుంది.
ఏమిటీ ముసాయిదా..
ప్రపంచంలో విద్యుత్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాల్లో 39 శాతం భవన నిర్మాణ రంగం నుంచే వస్తోంది. అలాగే మొత్తం విద్యుత్ వినియోగంలో 36 శాతం భవనాల్లోనే జరుగుతోంది. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా 2030 నాటికి నిర్మాణ రంగ ఇంధన డిమాండ్‌ను 50 శాతం తగ్గించగల సామర్థ్యం ఈసీఎస్‌బీసీకి ఉందని బీఈఈ గుర్తించింది. ఇంజనీర్లు, డెవలపర్‌లు, నిర్మాణ సంస్థల సంయుక్త సహకారంలో దీనిని విజయవంతం చేయాలని బీఈఈ భావిస్తోంది.
వనరుల సంరక్షణతో పాటు వ్యర్థాలు, కాలుష్యం, పర్యావరణ క్షీణతను తగ్గించడం, పగటిపూట సహజ వెలుతురు ప్రసరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముసాయిదాను తయారు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ని విభాగాలను భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. గృహ, పరిశ్రమ, వ్యవసాయం సహా అనేక రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది. భవనాల్లో దాదాపు 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది.
స్కూళ్లు, ఆస్పత్రులు, టీటీడీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులతో పాటు వాణిజ్య భవనాలు, నివాస భవనాల్లో ఇంధన సంరక్షణను ప్రోత్సహించడం కోసం ఈసీబీసీని కూడా అమలు చేస్తోంది. ప్రభు త్వం ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా అందించింది.
వ్యవసాయంలో డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించి రైతులు, పంప్ టెక్నీషియన్‌లతో వివిధ అవగాహన సెషన్‌లను నిర్వహించింది. ఇటువంటి చర్యలతో గతేడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు–2023ను ఆంధ్రప్రదేశ్ అందుకుంది.
‘ఈసీబీసీ’లో ఏపీ ఆదర్శం
వెయ్యికి పైగా భవనాల్లో ఈసీబీసీ అమలుతో పాటు 3 వేల మంది కంటే ఎక్కువ వాటాదారులకు శిక్షణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. వేగంగా అభివృద్ధి చెందుతూ.. విస్తరిస్తున్న విశాఖ వంటి నగరాల్లో ఈసీబీసీ అమలు వల్ల విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది.
నీటి వనరులు కూడా కలుషితం కావు. ఉత్పాదక రంగం వృద్ధి చెందుతుంది. భవన నిర్మాణ రంగంలో ఆవిష్కరణలు, పోటీతత్వం, గ్రీన్ ఉద్యోగాలు, నైపుణ్యాలు, సాంకేతికతలకు అవకాశాలు పెంచడంలో ఈ కోడ్ సహాయపడుతుంది. ఈ క్రమంలోనే విశాఖలో సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణాన్ని చేపట్టిన ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. – అభయ్ భాక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ
Comments
Please login to add a commentAdd a comment