సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న రాయితీ విద్యుత్‌కు సంబంధించిన ఆడిట్ వివరాలు, బిల్లుల లెక్కలను ఏపీఈఆర్సీకి ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర డిస్కంలకు సూచించింది. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) సేకరిస్తుందని తెలిపింది.
ఒకవేళ డిస్కంలు చెబుతున్న లెక్కల్లో తేడాలున్నట్టు తేలితే కేంద్రం నుంచి ప్రస్తుతం డిస్కంలకు అందుతున్న రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం స్కీమ్ (ఆర్డీఎస్‌ఎస్) ప్రోత్సాహకాలను నిలిపివేస్తామని, జరిమానాలు కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2005కి సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ నిబంధనల ప్రకారం.. విద్యుత్ సబ్సిడీ, దాని అకౌంటింగ్‌ను క్రమబద్ధీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. విద్యుత్ సబ్సిడీ పంపిణీ వివరాలను డిస్కంల నుంచి తీసుకోనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ సబ్సిడీకి సబ్సిడీ కేటగిరీ, వినియోగదారుల కేటగిరీ వారీగా వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన కచ్చితమైన లెక్కల ఆధారంగా డిస్కం సబ్సిడీ డిమాండ్‌ను పెంచారా లేదా అనే వివరాలు నివేదికలో ఉండాలని పేర్కొంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్–65 ప్రకారం సబ్సిడీకి సంబంధించిన వాస్తవ చెల్లింపు వివరాలు, ఇతర సంబంధిత వివరాల్లాగే చెల్లించాల్సిన సబ్సిడీ, చెల్లింపులో అంతరం వివరాలు కూడా నివేదికలో ఉండాలని చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
‘టైమ్ ఆఫ్ డే’ విధానానికీ సవరణ
రోజులో గంటల లెక్కన విద్యుత్ ధరల ప్రకారం బిల్లులు విధించే ‘టైమ్ ఆఫ్ డే’ విధానంలోనూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని పరిశ్రమలకే పరిమితమైన ఈ పద్ధతిని అన్ని పరిశ్రమలు, వాణిజ్య సర్విసులకు వర్తింపజేసేలా ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. రాష్ట్రాలు, విద్యుత్ సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకుంది.
ఈ నిబంధనలు అమలులోకి వస్తే విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు అధిక చార్జీలు విధించే అవకాశం ఉంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకూ రాయితీ లభించనుంది. అయితే, ఇందుకోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment