సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్‌ను రాష్ట్రాలకు కేటాయించే విషయంలో కేంద్ర విద్యుత్ శాఖ కొత్త ఆంక్షలు తెచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సబ్సిడీ బకాయిలను చెల్లించకపోయినా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పన్నులు విధించినా, అంతర్రాష్ట్ర విద్యుత్ క్రయవిక్రయాలకు అడ్డంకిగా మారినా ఆయా రాష్ట్రాలకు ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్ కేటాయించబోమని ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులేటరీ ఆస్తులు కలిగిన రాష్ట్రాలకు సైతం సెంట్రల్ పూల్ నుంచి కరెంట్ కేటాయించబోమని తేల్చి చెప్పింది. ఓ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని వారి నుంచి బిల్లుల రూపంలో వసూలు చేసుకునేందుకు వీలుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు టారీఫ్‌ను నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈఆర్సీలు తక్కువ టారీఫ్‌ను నిర్ణయిస్తే డిస్కంలకు మిగిలే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో రెగ్యులేటరీ అసెట్స్‌గా పేర్కొంటారు.
ఏటేటా రెగ్యులేటరీ అసెట్స్ రూపంలో డిస్కంల నష్టాలు రూ.వేల కోట్లకు పేరుకుపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. డిస్కంలకు నష్టాలు మిగలకుండా పెరిగే వ్యయానికి తగ్గట్టూ ఏటేటా విద్యుత్ చార్జీలను పెంచాలని ఈ నిబంధన ద్వారా కేంద్రం స్పష్టం చేస్తోంది. జల, సౌర విద్యుత్ వంటి గ్రీన్‌ఎనర్జీ, అంతర్‌రాష్ట్ర క్రయవిక్రయాలపై పన్నులు, సెస్‌లను విధించే రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి కరెంట్‌ను కేంద్రం కేటాయించదు.
ఇకపై షరతులు పాటిస్తేనే కరెంట్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 80 శాతం మేర దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం విక్రయిస్తోంది. మిగిలిన 20 శాతాన్ని ఎవరికీ కేటాయించని విద్యుత్ పేరుతో ‘సెంట్రల్ పూల్’కింద తమ వద్దే ఉంచుకుంటుంది. ఉదాహరణకి రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విద్యుత్‌లో రాష్ట్రానికి 1,280 మెగావాట్ల(80 శాతం) విద్యుత్‌ను మాత్రమే రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది.
మిగిలిన 320 మెగావాట్ల(20 శాతం) విద్యుత్‌ను సెంట్రల్ పూల్ కింద తన వద్దే ఉంచుకుంది. రాష్ట్రాల నుంచి విజ్ఞప్తుల ఆధారంగా ఈ విద్యుత్‌ను తాత్కాలిక కేటాయింపులు చేస్తుంది. ఇకపై ఏదైనా రాష్ట్రం సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేస్తే ఆ రాష్ట్రం సంబంధిత అంశాలను పాటిస్తుందా? లేదా ? అని కేంద్రం పరిశీలిస్తుంది. ఒక వేళ పాటించడం లేదని గుర్తిస్తే సెంట్రల్ పూల్ నుంచి ఆయా రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు జరపదు.
Comments
Please login to add a commentAdd a comment