ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి  | Central guidelines on purchase and sale of electricity | Sakshi
Sakshi News home page

ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి 

Published Sun, Sep 17 2023 5:18 AM | Last Updated on Sun, Sep 17 2023 5:18 AM

Central guidelines on purchase and sale of electricity - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది.

ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్‌కో ద్వారా విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్‌కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం.

దీంతో జెన్‌కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్‌ ఎనర్జీ ఎక్సే్ఛంజ్‌ (ఐఈఎక్స్‌)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్‌ పూల్‌ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్‌ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్‌ను ఐఈఎక్స్‌లో విక్రయిస్తారు. 

అంతా ఐఈఎక్స్‌లోనే 
విద్యుత్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్‌కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్‌ ఇండియన్‌ ఎనర్జీ ఎక్సే్ఛంజ్‌. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్‌ 27న ప్రారంభమైన ఐఈఎక్స్‌ 2017లో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టెడ్‌ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్‌ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్‌లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్‌లో 8,469 మిలియన్‌ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్‌ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ లావాదేవీలకు జెన్‌కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్‌కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్‌) వసూలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement