సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టును తీర్పును రిజర్వ్ చేసింది. గత బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యూడిషియల్ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
గురువారం సైతం ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు.
ఇవాళ ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులున్నారు. ప్రభాకర్‌రావును సైతం విచారించింది. కేసీఆర్‌కు కమిషన్ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని చెప్పారు. జూన్ 30 వరకు కమిషన్ గడువు ముగుస్తున్నందున జూన్ 15న రావాలని కోరాం.
వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే.. లేదా కేసీఆర్ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలో కోరింది. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించాయి. ఇది బహిరంగ కమిషన్. విచారణలో దాపరికం ఏమీ లేదు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఎక్కడా పక్షపాత ధోరణితో మాట్లాడలేదు. విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది. బీఆర్‌ఎస్ కూడా సభలో పలు విషయాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొంది అని వాదించారు.
ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ విచారణ స్వీకరించవద్దని ఏజీ కోరగా.. పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని, మెరిట్స్‌లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది.
మరోవైపు.. ఏజీ వాదనలపై కేసీఆర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కమిషన్ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడిషియల్ విచారణగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పుడు.. నివేదిక ఇవ్వాలే తప్ప మీడియాకు వివరాలు వెల్లడించకూడదని, విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి.. కారకులెవరో తేల్చమన్నారని, ఇది అసలు సరికాదని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు.
ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఇవాళ లేదంటే సోమవారం తీర్పు వెల్లడిస్తామని జడ్జి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment