2,400 మెగావాట్ల రెండో విడత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై ఎన్‌టీపీసీ అల్టిమేటం
విద్యుత్ కొనుగోలుపై నాన్చివేత ధోరణిలో రాష్ట్రం
గత ఫిబ్రవరి 10తోనే ముగిసిన గడువు
సీఎంఓ పరిశీలనలోనే ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్‌కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది.
రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్‌టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్‌టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం
తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్‌టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్‌టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్‌టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్‌టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది.
స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.
తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్‌కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు
రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్‌టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది.
శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment