మొబైల్‌ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్‌ | Sakshi
Sakshi News home page

మొబైల్‌ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్‌

Published Sun, Feb 25 2024 6:09 AM

Recharge electricity just like mobile - Sakshi

సాక్షి, అమరావతి:విద్యుత్‌ విని­యోగదారులందరినీ ప్రీపె­యిడ్‌ మీటర్ల నెట్‌వర్క్‌ పరిధి­లోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌)లో భాగంగా దేశవ్యా­ప్తంగా 19.79 కోట్ల విద్యుత్‌ సర్వీసులు, 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌), 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్‌ లేదా స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది.

ఈ మేరకు మీటర్ల బిగింపు, అమలు ప్రక్రియపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) జారీ చేసింది. ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంతమేర విద్యుత్‌ వాడుతున్నారో ఆ మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ముందుగా చెల్లించి రీచార్జ్‌ చేసుకోవాలి. రీచార్జ్‌ మొత్తం అయిపోగానే వినియోగదారుల మొ­బైల్‌కు మూడు­సార్లు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపాలి. 

ప్రతి కస్టమర్‌కు రూ.300 అరువు ఇచ్చేలా..
ప్రతి వినియోగదారునికీ గరిష్టంగా రూ.300 క్రెడిట్‌ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్‌ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్‌ను వాడుకునే వెసులుబాటు కల్పించాలి. ముందుగా చెల్లించిన రూ.1,000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్‌ చేసుకునేలా తొలి సందేశం పంపాలి. రీచార్జ్‌ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్‌గా ఇచ్చిన రూ.300 కరెంట్‌ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి ఆ తరువాత విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని (డిస్‌కనెక్ట్‌) కేంద్రం సూచించింది.

వినియోగదారులు మళ్లీ రీచార్జ్‌ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాక మొబైల్‌లో సంబంధిత యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలని, వినియోగదారులు ఈ యాప్‌ ఆధారంగా విద్యుత్‌ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొంది. అంటే విద్యుత్‌ అవసరం లేనప్పుడు మీటర్‌ను ఆఫ్‌ చేసుకోవడం ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చు.

రాష్ట్రంలో మొదలైన ప్రక్రియ
విద్యుత్‌ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్‌) పథకంలో భాగంగా స్మార్ట్‌ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని మూడు డిస్కంలు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్‌ సర్వీసులకు, వాణిజ్య, పరిశ్రమలు, గృహæ విద్యుత్‌ సర్వీసులకు ప్రీ–పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.

మొదటి విడతలో దక్షిణ డిస్కం పరిధిలో 6.19 లక్షల సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు, 2.56 లక్షల త్రీ ఫేజ్‌ మీటర్లను ఏర్పాటు చేయనుండగా.. మధ్య డిస్కం పరిధిలో 7.23 లక్షల సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు, 1.09 లక్షల త్రీ ఫేజ్‌ మీటర్లు అమర్చనున్నారు. తూర్పు డిస్కం పరిధిలో 6.09 లక్షల సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు, 1.15 లక్షల త్రీ ఫేజ్‌ మీటర్లను అమర్చనున్నారు. స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్‌ బాధ్యత మొత్తం సర్వీస్‌ ప్రొవైడర్లదే.

ఈ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార (టైం అప్‌డే) టారిఫ్‌ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్‌ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్‌ పీక్‌ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్‌ లాభం పొందే అవకాశం ఉంది. బిల్లును ఎప్పటికప్పుడు తెలు­సుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్‌ సరఫరా చేసే సమయం, విద్యుత్‌ నాణ్యత తెలుసుకునే అవకాశం ఉంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement