సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏపీలోనే అధికంగా ఉందనడంలో వాస్తవం లేదని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ), డిస్కంలు స్పష్టం చేశాయి. ‘దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ కొరత అధికం’ శీర్షికతో ఆదివారం ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఎస్‌ఎల్‌డీసీ, డిస్కంలు ఖండించాయి.
20 సూత్రాల అమలు కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2022–23 ఆ ర్థిక సంవత్సరం విద్యుత్ సరఫరా గణాంకాలను ఉటంకిస్తూ ఈనాడు వార్తా కథనం ప్రచురించింది. అయితే గత ఆ ర్థిక సంవత్సరం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, 0.04 శాతం మాత్రమే సరఫరాలో లోటు ఉందని, ఇది కూడా స్థానికంగా ఏర్పడిన సాంకేతిక ఇబ్బందుల వల్లేనని డిస్కంలు పేర్కొన్నాయి. ఎస్‌ఎల్‌డీసీ, డిస్కంలు ఏం చెప్పాయంటే..
ఏపీలో వాస్తవ కొరత 0.4 శాతమే
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం విద్యుత్ సరఫరాలో ఝార్ఖండ్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరంలో 20 సూత్రాల అమలు పథకంపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ డిమాండ్–సరఫరా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 93 శాతం మాత్రమే విద్యుత్ సరఫరా చేయగలిగింది. నాగాలాండ్ డిమాండ్‌లో 94 శాతం సరఫరా చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో మొత్తం ఏడాదిలో 915 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. 892 మిలియన్ యూనిట్లు సరఫరా చేసింది. 24 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. దీంతో ఆ రాష్ట్రం 98 శాతం విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వార్షిక నివేదికలో పేర్కొంది.
రాజస్థాన్‌లో గత ఆ ర్థిక సంవత్సరం 1,01,801 మిలియన్ యూనిట్ల డిమాండ్‌కు గాను.. 1,00,057 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసింది. అంటే 1,745 మిలియన్ యూనిట్ల సరఫరా లోటు ఏర్పడింది. మొత్తమ్మీద చూస్తే రాజస్థాన్ డిమాండ్‌లో 98 శాతం విద్యుత్ సరఫరా చేసింది. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్‌లో 98 శాతం మేరకు సరఫరా చేశాయి.
కేంద్ర గణాంకాల ప్రకారం తెలంగాణలో 0.04 శాతం, కర్ణాటకలో 0.03 శాతం విద్యుత్ కొరత ఉంది. ఏపీలో కూడా వాస్తవ కొరత 0.4 శాతం మాత్రమే. విద్యుత్ డిమాండ్‌లో తెలంగాణ 99.96 శాతం, కర్ణాటక 99.97 శాతం, తమిళనాడు 99.93 శాతం, ఆంధ్రప్రదేశ్ 99.56 శాతం విద్యుత్ సరఫరా చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment