బాన్సువాడ రూరల్ : సిమెంట్, స్టీల్, ఇటుకల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ అప్పుచేసి సొంతిల్లు నిర్మించుకుందామనుకున్న సామాన్యుడి కల నెరవేరటం లేదు. అకాశాన్ని అంటుతున్న బిల్డింగ్ మెటీరియల్ ధరలతో సగంలోనే నిర్మాణాలు ఆగిపోతున్నాయి. బాన్సువాడలో నెలరోజుల క్రితం వరకు రూ. 200 ఉన్న బస్తా సిమెంట్ ధర ప్రస్తుతం రూ. 300కు చేరింది.
సాధారణ ఇటుక ధరసైతం మొన్నటి వరకు వెయ్యికి రూ. 2,500 ఉండగా ప్రస్తుతం రూ. 3,000లకు చేరింది. స్టీలు క్వింటాలుకు రూ. 4,500 పలుకుతోంది. పెరిగిన ధరలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా సిమెంట్, ఇటుక, స్టీలు ధరలు పెరుగుతుండటంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టిన వారుకూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు ధరలు పెరుగిపోతూ ఉండటంతో పలువురు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు.
సాధారణంగా వేసవి కాలంలోనే గృహ నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో నిర్మాణాలు ప్రారంభించినవారు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలకు చేయాల్సిన ఖర్చు అంచనాలకు రెట్టింపు అవుతోందని భవన నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.
గతంలో సాధారణంగా గ్రామాల్లో పెంకుటిళ్లను మాత్రమే నిర్మించుకునేవారు. ఆర్‌సీసీ బిల్డింగ్‌ల నిర్మాణాలు అరుదుగా జరిగేవి. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా పెంకుటిళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్‌సీసీ భవనాల నిర్మాణాలు పెరిగాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కూడా మందగించాయి.
ప్రభుత్వం స్పందించాలి..
ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యుడికి సొంతింటి కల నెరవేరని పరిస్థితులు నెలకొంటాయి. సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సీఏం కేసీఆర్ వెంటనే కొత్తవారితోపాటు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారికి సైతం గృహ నిర్మాణానికి రూ. 3 లక్షలు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.
స్టీల్, సిమెంట్ ధరలు పైపైకి
Published Mon, Jul 7 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement