palle raghunathareddy
-
అగ్ని ప్రమోదం!
మృత్యువుకు ఆహ్వానం - అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే నిర్మాణాలు - ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి - దాడులు నిర్వహించని అధికారులు - ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయం - నిర్మాణాల సమాచారం లేని అగ్నిమాపక శాఖ - గతనెల 25న ఆలమూరు రోడ్డులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన బాలాజీ కళాశాలలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వంద కంప్యూటర్లు, ఏసీలు దగ్ధమయ్యాయి. - గత నెల 24న మారుతీనగర్‌లోని శ్రీచైతన్య స్కూల్ రెండవ అంతస్తులో షార్టు సర్క్యూట్ జరిగింది. వెంటనే విద్యార్థులను బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. - ఈ రెండు యాజమాన్యాలు తొలుత ఫైర్‌సేఫ్టీ అనుమతి పొందినా రెన్యూవల్ చేసుకోకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. అగ్నిమాపక శాఖ అనుమతులు ఇలా.. సంస్థ మొత్తం అనుమతి సినిమాల్స్ 75 28 ఫంక్షన్‌హాల్స్ 330 3 హాస్పటల్స్ 434 46 ప్రై వేటు స్కూల్స్ 1350 828 కోల్డ్ స్టోరేజస్ 11 1 పరిశ్రమలు 198 22 అనంతపురం సెంట్రల్: బహుల అంతస్తుల భవనాలు.. సినిమా హాళ్లు.. స్కూళ్లు.. హాస్పిటళ్ల నిర్మాణం చూస్తే కళ్లు చెదరాల్సిందే. బయటకు చూడచక్కగా కనిపించే వీటిలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే బయటపడటం కష్టమే. ఎందుకంటే.. అధిక శాతం నిర్మాణాల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటిస్తున్న దాఖలాల్లేవు. కొందరు అనుమతి తీసుకుంటున్నా.. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చిన్న ప్రమాదం జరిగినా నియంత్రించే సామగ్రి లేకపోవడంతో ప్రజల ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. లక్షలాది రూపాయలతో వ్యాపారం చేస్తున్నా.. కనీస ప్రమాణాలను విస్మరించడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందోననే చర్చ జరుగుతోంది. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుడ్లప్పగించి చూస్తున్న అగ్నిమాపకశాఖ జిల్లాలో ఎలాంటి అనుమతుల్లేని నిర్మాణాల విషయంలో అగ్నిమాపక శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సంస్థలపై ఎలాంటి దాడులు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉండటంతో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోకుండానే యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇటీవల శ్రీచైతన్య స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పరిశీలిస్తే.. యాజమాన్యం పిల్లల భవిష్యత్తుతో ఎలా చెలగాటం ఆడుతుందో అర్థమవుతోంది. సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినా.. అగ్నిమాపక శాఖ అధికారులు ఇప్పటికీ పట్టించుకోకపోవడం వెనుక ముడుపుల వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పై అంస్తుల నుంచి దిగేందుకు ఒకే మెట్ల మార్గం ఉంది. ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమవుతోంది. జిల్లాలోని చాలా వరకు ప్రయివేట్ స్కూళ్లు.. కార్పొరేట్, ప్రయివేట్ హాస్పిటళ్లు ఫైర్‌సేఫ్టీ అనుమతి తీసుకోకపోయినా అధికారులు దాడులు నిర్వహించకపోవడం గమనార్హం. ఏటా ఏప్రిల్ 14 నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ వారోత్సవాల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నకు సమాధానం కరువయింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమి అగ్నిమాపకశాఖతో మిగిలిన ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. అనుమతులు ఇచ్చేటప్పుడు అగ్నిమాపకశాఖ నిబంధనలు పాటిస్తున్నారా? అనుమతి పొందారా అనే వివరాలు తెలుసుకోవట్లేదు. భవంతులు, ప్రైవేటు స్కూళ్లు, హాస్పటళ్లలో ఫైర్‌సేఫ్టీ పాటించకపోయినా ఆ శాఖల అధికారులు అనుమతులు ఇస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఎన్ని ప్రైవేటు స్కూళ్లు, హాస్పిటళ్లు, సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయనే సమాచారం కూడా అగ్నిమాపక శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. అనేకమార్లు ఆయా శాఖల అధికారులకు లేఖలు పంపినా స్పందన కరువయిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అగ్నిమాపశాఖ అధికారుల వద్దకు వచ్చిన వారికి మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. తక్కిన సమయాల్లో అధికారులు తనిఖీలు చేయడం.. కేసులు నమోదు చేయకపోవడంతో భవంతులు మృత్యువుకు ఆహ్వానం పలుకుతున్నాయి. చర్యలు తప్పవు జిల్లాలో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోని సంస్థలను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. జన సందోహం ఉండే ప్రతి ఒక్క హాస్పిటల్, స్కూల్, సినిమా హాల్, పరిశ్రమలు తప్పనిసరిగా అనుమతి పొందాలి. లేకపోతే చర్యలు తప్పవు. - కె.సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి. -
‘పల్లె’కు వర్గీకరణ సెగ
ఓడీ చెరువు : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్లే ‘పల్లె’ రఘునాథరెడ్డికి ఎస్సీ వర్గీకరణ సెగ తగిలింది. శనివారం ఓడీ చెరువు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి పల్లె పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు తంగేడుకుంట గ్రామం వద్ద రోడ్డుకడ్డంగా బైఠాయించి, నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులను రోడ్డుపై నుంచి తొలగించేందుకు పోలీసులను పల్లె ఆదేశించారు. ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐలు ఇస్మాయిల్, శివప్రసాద్ సిబ్బందితో కలిసి ఎమ్మార్పీఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి వర్గీకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బేకరీ గంగాధర్, కాలేజ్ తిప్పన్న, జింక సుంకన్న, రామయ్య మాట్లాడుతూ మందకృష్ణమాదిగ చేపట్టిన కురుక్షేత్ర యాత్రను అడ్డుకొని మాదిగలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సుమారు రెండు గంటల పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డుపై భైఠాయించడంతో ఎట్టకేలకు ఆలస్యంగా ఎమ్మెల్యే పల్లె తంగేడుకుంటకు వచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్లను విన్న ఎమ్మెల్యే పల్లె సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామ్మోహన్, ఆనంద్, లక్ష్మీనారాయణ, రమణ, ఎర్రదొడ్డెప్ప, గంగాద్రి, కిష్ట, వీరప్ప, నాగభూషణ, డీలర్ రమణ, పలకగంగన్న, వెంకటరమణ, గంగులప్ప మహిళలు పాల్గొన్నారు. -
తమ్ముళ్లు బాహాబాహీ
- మాజీ మంత్రి ఎదుటే ఘటన - ఓబుళదేవరచెరువులో ఉద్రిక్తత - అక్కడి నుంచి వెళ్లిపోయిన మాజీ మంత్రి పల్లె ఓబుళదేవరచెరువు (పుట్టపర్తి) : ఓబుళదేవరచెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల పంపిణీ కేంద్రం వద్ద గురువారం సాయంత్రం మాజీ మంత్రి, పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి ఎదుటే టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. తమ్ముళ్ల మధ్య రెండు వర్గాలు గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చొరవతో గొడవ సద్దుమణిగింది. రెండు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అసలేం జరిగిందంటే... మండలంలోని ఎం.కొత్తపల్లికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు, మామిళ్లకుంట్లపల్లికి చెందిన మరికొందరు కార్యకర్తల మధ్య గొడవ జరిగి కొట్టుకొనేందుకు సిద్ధపడ్డారు. మామిళ్లకుంట్లపల్లికి చెందిన సీనియర్ మేట్‌ను తొలగించి టీడీపీకి చెందిన వ్యక్తిని నియమించాలని ఎం.కొత్తపల్లికి చెందిన టీడీపీ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డిని కోరారు. ఇది గమనించిన అదే పార్టీలోని మరో వర్గానికి చెందిన వారు మాజీ మంత్రి వద్దకు చేరారు. రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ రెండు వర్గాలకు ఎమ్మెల్యే సర్దిచెప్పలేక \అక్కడి నుంచి అమడగూరుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య గొడవ మరింత రాజుకుంది. ఓ దశలో వారు కొట్టుకొనేందుకు తలపడ్డారు. అక్కడే ఉన్న ఎంపీపీ ఇస్మాయిల్, టీడీపీ నాయకులు అల్లాబకష్, శ్రీరాములు నాయుడు, జయచంద్ర జోక్యం చేసుకున్నారు. రెండు వర్గాలను పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఓ దశలో రెండు వర్గాల మధ్య పరిస్థితి అదుపు తప్పే క్రమంలో పోలీసులు జోక్యం చేసుకొని వారిని చెదరకొట్టారు. అనంతరం రెండు వర్గాల ఫిర్యాదులును స్వీకరించారు. -
ప్రకంపనలు
– మంత్రివర్గ విస్తరణతో ‘అనంత’ టీడీపీలో రేగిన చిచ్చు – రాజకీయాలను నుంచి తప్పుకునే యోచనలో ‘పల్లె’ – నేడు పుట్టపర్తిలో కార్యకర్తలతో సమావేశం..నిర్ణయం వెల్లడించే అవకాశం – ఏ క్షణమైనా కఠిన నిర్ణయం తీసుకుంటానని సన్నిహితులతో చెప్పిన బీకే – బీకేకు అండగా రాజీనామా చేసిన మార్కెట్‌యార్డు చైర్మన్, రొద్దం సింగిల్ విండో అధ్యక్షుడు – బీకేకు అన్యాయం చేశారంటూ చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసిన కురుబసంఘం – ‘కాలవ’కు పట్టం కట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న మెజార్టీ ఎమ్మెల్యేలు సాక్షిప్రతినిధి, అనంతపురం మంత్రివర్గ విస్తరణ ‘అనంత’ టీడీపీలో చిచ్చు రేపుతోంది. పార్టీకోసం సుదీర్ఘకాలం శ్రమించిన వారికి అధిష్టానం అన్యాయం చేసిందని పార్టీ సీనియర్ నేతలతో పాటు పలు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఏళ్లతరబడి పార్టీ జెండా మోసినా ప్రయోజనం లేనప్పుడు పార్టీలో ఎందుకు కొనసాగాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లె’ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పువాలనే నిర్ణయానికి రాగా ..టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ‘అనంత’ టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలుగుదేశం పార్టీకి ‘అనంతపురం’ కంచుకోటలాంటిదని పలు సందర్భాల్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ పెనుకొండ నుంచి అనంతపురం వరకూ చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీకి 92 శాతం నష్టం వాటిల్లిందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ మాట వల్లె వేయడం మానేశారు. 2014 ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన అంశాన్ని పక్కనపెడితే ఈ మూడేళ్లలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పెనుకొండలో ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ధర్మవరంలో మంత్రి సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి, కదిరిలో ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట, అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, రాయదుర్గంలో కాలవ, మెట్టు గోవిందరెడ్డి, మడకశిరలో ఈరన్న, తిప్పేస్వామి...ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యపోరుతో పార్టీ కేడర్ చెల్లాచెదురైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2014 ఫలితాలు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ‘రివర్స్’లో ఉంటాయని చంద్రబాబే స్వయంగా చేయించి సర్వేరిపోర్టు తేల్చిచెప్పింది. మంత్రివర్గ విస్తరణతో మరింత కుదేలు ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ పార్టీకి మరింత నష్టం కలిగిస్తోంది. సౌమ్యుడైన తనను మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని పల్లె రఘునాథరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకంటే అవమానం తనకు లేదని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని తన సన్నిహితుల్లో వాపోయినట్లు తెలుస్తోంది. సోమవారం పుట్టపర్తిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ‘పల్లె’ సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ‘పల్లె’కు మంత్రి పదవి ఇవ్వలేదని బుక్కపట్నం మండల టీడీపీ కార్యదర్శి గంగాధర్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు బీసీకోటాలో తనకు బెర్త్ దాదాపు ఖరారైందని 3 నెలలుగా తన సన్నిహితులతో బీకే పార్థసారథి చెబుతూ వచ్చారు. అయితే కాలవ శ్రీనివాసులకు ఇవ్వడంతో తీవ్ర నిర్వేదానికి లోనయ్యారు. పదేళ్లపాటు పార్టీ అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా తీవ్రంగా శ్రమించానని, కానీ కాలవకు ఇవ్వడమంటే పథకం ప్రకారమే తనను చంద్రబాబు పక్కనపెట్టారని తన సన్నిహితులతో బీకే వాపోయినట్లు తెలుస్తోంది. నేడో, రేపో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఆలోచిస్తామని కూడా పెనుకొండలోని తన సన్నిహితులతో బీకే చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షపదవి కూడా తనకు వద్దనే నిర్ణయానికి బీకే వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు బీకేకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా పెనుకొండ మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి వెంకట్రామిరెడ్డి, రొద్దం సింగిల్‌విండో అధ్యక్ష పదవికి ఆంజనేయులు రాజీనామా చేశారు. కురుబసంఘం యువజన విభాగం నేతలు ‘అనంత’లో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. అంతర్మథనంలో టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణతో టీడీపీలోని ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కేడర్ అంతర్మథనంలో పడిపోయింది. పార్టీకోసం శ్రమించినవారిని పార్టీ ఎలా గుర్తిస్తోంది? కేవలం ‘సిఫార్సు’లకే పెద్దపీట వేసే పార్టీలో శక్తికిమించి శ్రమించాల్సిన అవసరం ఉందా? ఈరోజు పార్టీ సీనియర్లకు జరిగిన అన్యాయమే రేపు తమకూ జరగదనే గ్యారెంటీ ఏముందని పార్టీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ధర్మవరం, అనంతపురం, పెనుకొండ, తాడిపత్రి ఎమ్మెల్యేలతో పాటు ఉరవకొండ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి విస్తరణపై పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన ఈ పొరపాటు ఎంత తీవ్రమైందో ఇప్పటికిప్పుడు తెలీదని, మరో రెండేళ్లు టీడీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రథమ, ద్వితీయ శ్రేణి నేతలు నోరుమెదపలేరని, 2019లో పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఓ సీనియర్ నేత ‘సాక్షి’తో అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు కూడా చాలామంది ఆశించడం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే టీడీపీలో ఇప్పటి వరకూ చురుగ్గా పనిచేసిన నేతలు కాడి వదిలేసి, పార్టీ కార్యక్రమాల్లో ఇష్టంగా కాకుండా మొక్కుబడిగా పాల్గొంటారని తెలుస్తోంది. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. -
మంత్రి రాకతో వైఎస్సార్సీపీ నాయకుల ఆందోళన
ఓడీ చెరువు : మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం సాయంత్రం ఓడీచెరువు పోలింగ్ కేంద్రం సమీపంలోకి రావడంతో వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వెంటనే ఎస్ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది అప్రమత్తమై మంత్రి పల్లెను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన సమీపంలోని టీడీపీ నాయకుని ఇంట్లోకి వెళ్లారు. పది నిమిషాలు దాటినా బయటకు రాకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు మొదట వారిని, తర్వాత మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు. ఆందోళనలో వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎద్దుల శ్రీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మిరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరంగారెడ్డి, నాయకులు ఎద్దుల రామసుబ్బారెడ్డి, వెల్డింగ్ బాషా, కొత్తపల్లి బాషా, సలీం, జయరాంరెడ్డి, ఆంజనేయులు, వెంకటనారాయణ, ముబారక్, ఆదిశేఖర్, సూర్యనారాయణరెడ్డి, చౌటకిష్ట, మునెప్ప, అలీఖాన్, సురేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
ఓ లుక్కేద్దాం
– టీడీపీ నేత షకిల్‌షఫీ కుటుంబసభ్యుల నుంచి 204.03 ఎకరాల కొనుగోలు – ప్రతిఫలంగా నగదుతో పాటు షకిల్‌షఫీ తండ్రికి వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గిరి కట్టబెట్టే వ్యూహం – ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మద్దతూ కూడగట్టిన వైనం – ‘పల్లె’ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – టీడీపీలో చిచ్చురేపుతోన్న వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపిక వ్యవహారం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి విషయమై టీడీపీలో చిచ్చురేగుతోంది. తన అస్మదీయుణ్ని చైర్మన్ చేయాలని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రతిపాదిస్తున్నారు. దీన్ని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మినహా తక్కిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం జిల్లా టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీలోని కీలక వర్గాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరు సమీపంలో (నగరానికి అతి దగ్గరగా..) 204.03 ఎకరాల భూమిని మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొనుగోలు చేశారు. ఇందులో 117.04 ఎకరాలను గత ఏడాది జూలై 25న, మరో 86.99 ఎకరాలను అక్టోబరు 26న కొన్నారు. మొత్తం భూములను బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, దాని ప్రస్తుత అధ్యక్షుడు పల్లె రఘునాథరెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూములను అనంతపురానికి చెందిన టీడీపీ నేతలు కేఎం షఫీవుల్లా, కేఎం షకిల్‌షఫీ, వారి కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నారు. ఇక్కడ ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.15–20 లక్షల వరకు ధర పలుకుతోంది. మంత్రి మాత్రం రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరానికి రూ.1.50 లక్షలు చెల్లించారు. తక్కిన మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే రిజిస్ట్రేషన్‌లో రూ.3.6 కోట్లు అధికారికంగా చూపించి, అనధికారికంగా రూ.27–30 కోట్లు చెల్లించినట్లు సమాచారం. పదవి కోసం ఒప్పందం! భూ లావాదేవీల సమయంలో షఫీవుల్లాకు, మంత్రి పల్లెకు మధ్య ఓ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. భూములు ఇస్తున్నందున ప్రతిఫలంగా తనకు వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి దక్కేలా చూడాలని షఫీవుల్లా కోరినట్లు సమాచారం. అయితే.. తాను మైనార్టీశాఖ మంత్రి అయినప్పటికీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపిక ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుందని, దీనిపై తాను హామీ ఇవ్వలేనని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రికి మరో బాధ్యతను అప్పగించారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియలో మొదటగా 11మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఒక డైరెక్టర్‌ను చైర్మన్ చేస్తారు. ముతవల్లిల కోటాలో ఒకరిని డైరెక్టర్‌గా నామినేట్ చేసే అవకాశముంది. తనను నామినేట్ చేసే బాధ్యతను పల్లెకు అప్పగించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అయిన తర్వాత చైర్మన్ కోసం మరో ప్రయత్నం చేయొచ్చనేది షఫీవుల్లా ఆలోచనగా ఉంది. టీడీపీలో మైనార్టీలెవరూ ఎమ్మెల్యేలుగా విజయం సాధించలేదు. అరువొచ్చిన జలీల్‌ఖాన్, చాంద్‌బాషా కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న లాబీతో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గిరి దక్కించుకోవాలని షఫీవుల్లా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు చేజారితే మరెప్పుడూ దక్కదనే ఆలోచనతో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షఫీవుల్లా తెలంగాణ ఏసీబీ డీజీ ఏకేఖాన్కు స్వయాన మామ. ఆయన కుమారైను ఏకేఖాన్ వివాహం చేసుకున్నారు. టీడీపీలో ధిక్కార స్వరం ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ముఖ్య నేతల వద్ద పల్లె ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదనను అనంతపురం ఎమ్మెల్యే మినహా జిల్లా టీడీపీలోని దాదాపు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించినట్లు సమాచారం. షఫీవుల్లా కుటుంబం టీడీపీని అడ్డుపెట్టుకుని లబ్ధిపొందడం మినహా పార్టీకి వారు చేసేందేమీ లేదని, అయినప్పటికీ షఫీవుల్లా కుమారుడు షకిల్షఫీని శాప్ డైరెక్టర్ చేశామని, తిరిగి అదే కుటుంబానికి వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టాలని ప్రతిపాదన తేవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పల్లె ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కేబినెట్ విస్తరణతో పాటు వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపిక కూడా చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ విస్తరణలో పల్లె పోస్టు ఉంటుందా, ఊడుతుందా అనే అంశంపై స్పష్టత లేదని, ఈ క్రమంలో తన పోస్టును కాపాడుకుంటే చాలని, వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపికలో తలదూర్చడం ఏంటని ఇద్దరు ఎమ్మెల్యేలు పల్లెపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
పేదలకు కార్పొరేట్ వైద్యం.. ప్రభుత్వ లక్ష్యం
► మంత్రులు పల్లె, పరిటాల ► రోటా వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స ప్రారంభం అనంతపురం మెడికల్ : పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో రోటా వైరస్ వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స వాహనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. పేదలు వైద్యం కోసం 50 శాతం డబ్బు వెచ్చిస్తున్నారన్నారు. దీనిని గ్రహించిన ప్రభుత్వం ఉచితంగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. చంద్రన్న సంచార చికిత్స పేరుతో పల్లెపల్లెకు వైద్యసేవలు తీసుకెళ్తామన్నారు. ఈ వాహనాల్లో షుగర్, బీపీ, ఆస్తమా, మూర్ఛ, దీర్ఘకాలిక వ్యాధులు తదితర వాటికి ఉచితంగా చికిత్స చేయనున్నట్లు చెప్పారు. డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అనంతరం చిన్నారులకు రోటా వ్యాక్సిన్‌ను వేశారు. ‘చంద్రన్న సంచార చికిత్స’ వాహనానికి మంత్రి సునీత జెండా ఊపగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనాన్ని నడిపి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్‌సాహెబ్, ఎమ్మెల్సీ శమంతకమణి జేసీ-2 ఖాజామొహిద్దీన్, వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ రావెల సుధీర్‌బాబు, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, జాతీయ ఆరోగ్య మిషన్ డీపీఎంఓ డాక్టర్ అనిల్‌కుమార్, ఎస్ఓలు మారుతిప్రసాద్, ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ పర్యాటక స్థలంగా గండికోట!
కడప : వైఎస్ఆర్ జిల్లాలోని గండికోటను ప్రపంచ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. గండికోటలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వారసత్వ ఉత్సవాలను శనివారం వారు ప్రారంభించారు. బ్రోచర్ ఆవిష్కరణ అనంతరం ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసే పర్యాటక సర్క్యూట్లో గండికోటను చేరుస్తామన్నారు. గండికోటలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని ఆయన కొనియాడారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రముఖ రాజులు, కోటల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐటీ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పురాతన కట్టడాలు, కళలను ప్రజలు మరచి పోతున్నారని.. వాటికి పునర్వైభవం తీసుకువస్తామని చెప్పారు. ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి జనవరి 26, ఆగస్ట్ 15వ తేదీల్లో అవార్డులు అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతకు ముందు మంత్రులు గండికోటలోని జుమ్మా మసీదు, చార్మినార్, రంగనాయక స్వామి మండపం, పెన్నానది లోయను పరిశీలించారు. పెన్నా లోయపై స్కైవాక్ ఏర్పాటు చేసే విషయమై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కె.వి.రమణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జేసీ-2 కృష్ణభారతి పాల్గొన్నారు. -
ఇక పొరుగు ఇసుక
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలో భవన నిర్మాణరంగంలో సంక్షోభం సృష్టిస్తున్న ఇసుక సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. నగరానికి అవసరమైన మేరకు ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు అంగీకరించారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో విశాఖతో పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి మంగళవారం సమీక్షించారు. సమావేశానంతరం భేటీ వివరాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. విశాఖ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నిర్మాణ రంగ అవసరాల కోసం 11 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని, ప్రస్తుతం 1.59 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందన్నారు. దీనివల్ల నిర్మాణ రంగానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని, తద్వారా వేలాదిమందికి ఉపాధి లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు, విజయనగరం జిల్లా నుంచి 2 లక్షల క్యూబిక్ మీటర్లు, తూర్పుగోదావరి నుంచి ప్రస్తుతం రోజుకు 1500ల క్యూ బిక్ మీటర్లు వరద ప్రవాహం తగ్గిన తర్వాత రోజుకు ఐదు వేల క్యూబిక్ మీటర్ల చొప్పున సరఫరా చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు అంగీకరించారన్నారు. ఇసుక సమస్య పరి ష్కారం కోసం రీచ్‌ల వద్ద రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపేం దుకు అనుమతినివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నోడల్ ఏజెన్సీగా కలెక్టర్ ఇక నుంచి ఇసుక సరఫరాపై నోడల్ ఏజెన్సీగా విశాఖ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు. విశాఖ కలెక్టర్ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు ఇసుక సరఫరా చేస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుకను జీవీఎంసీ, వ్యక్తిగత అవసరాల కోసం వినియోగిస్తారని చెప్పారు. భద్రాచలం సమీపంలో రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్లు చెప్పారని మంత్రి తెలిపారు. క్రెడాయ్ తదితర సంస్థలు అక్కడ నుంచి రవాణా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నగరంలో ఇసుక సరఫరా అంశంపై నిరంతర నిఘా.. సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు డాక్టర్ ఎన్.యువరాజ్, పి.లక్ష్మీనరసింహం, ఎంఎం నాయక్, హెచ్ అరుణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలు సత్యసాయి శ్రీనివాస్, డిల్లేశ్వరరావు, తనూజ రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకల నిర్వహణకోసం రూ.5 కోట్లు కేటాయించినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆయన వివిధ రంగాల్లో తన ప్రాభవాన్ని చాటుతోన్న 35 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేస్తామన్నారు. ఈ ఏడాది తెలుగు-వెలుగు పురస్కారాన్ని బాలాంతరపు రజినీకాంతరావుకు అందజేస్తున్నట్లు తెలిపారు. -
లండన్ చేరిన పల్లె : ఐర్లండ్ నేతలతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం అర్ధరాత్రి లండన్ చేరుకున్నారు. అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన అక్కడకు వెళ్లారు. భారత, ఇంగ్లండ్ దౌత్య కార్యాలయ అధికారులు, పలువురు ఆంధ్రులు స్వాగతం పలికారు. ఉత్తర ఐర్లండ్ పార్లమెంట్ స్పీకర్‌తో చర్చలు జరిపారు.