‘పల్లె’కు వర్గీకరణ సెగ
ఓడీ చెరువు : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్లే ‘పల్లె’ రఘునాథరెడ్డికి ఎస్సీ వర్గీకరణ సెగ తగిలింది. శనివారం ఓడీ చెరువు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి పల్లె పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు తంగేడుకుంట గ్రామం వద్ద రోడ్డుకడ్డంగా బైఠాయించి, నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులను రోడ్డుపై నుంచి తొలగించేందుకు పోలీసులను పల్లె ఆదేశించారు. ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఎస్‌ఐలు ఇస్మాయిల్, శివప్రసాద్ సిబ్బందితో కలిసి ఎమ్మార్పీఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి వర్గీకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు.
ఎమ్మార్పీఎస్ నాయకులు బేకరీ గంగాధర్, కాలేజ్ తిప్పన్న, జింక సుంకన్న, రామయ్య మాట్లాడుతూ మందకృష్ణమాదిగ చేపట్టిన కురుక్షేత్ర యాత్రను అడ్డుకొని మాదిగలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సుమారు రెండు గంటల పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డుపై భైఠాయించడంతో ఎట్టకేలకు ఆలస్యంగా ఎమ్మెల్యే పల్లె తంగేడుకుంటకు వచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్లను విన్న ఎమ్మెల్యే పల్లె సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామ్మోహన్, ఆనంద్, లక్ష్మీనారాయణ, రమణ, ఎర్రదొడ్డెప్ప, గంగాద్రి, కిష్ట, వీరప్ప, నాగభూషణ, డీలర్ రమణ, పలకగంగన్న, వెంకటరమణ, గంగులప్ప మహిళలు పాల్గొన్నారు.