వర్గీకరణను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి
నెల్లూరు(సెంట్రల్): ఎస్సీ వర్గీకరణను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ పేర్కొన్నారు. నెల్లూరులోని ఒక కళ్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరవయ్యేళ్ల క్రితమే వర్గీకరణ జరగాల్సిందని, తమ కులంలోనే ఉన్నత స్థానంలో ఉన్నవారు దానిని అడ్డుకున్నారన్నారు. న్యాయస్థానాలలో ఏపీకి చెందినవారు కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్గీకరణకు కేంద్రం అనుకూలంగా ఉందని తెలుస్తోందన్నారు. చివరి నిమిషంలో కూడా వర్గీకరణను అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలసి ఎస్సీ వర్గీకరణ సాధించుకునేందుకు పోరాడుదామని పిలుపునిచ్చారు. అందుకే నవంబరు 20న హైదరాబాద్‌లో మాదిగల మహాధర్నా కార్యక్రమం చేపట్టామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మందాపెంచలయ్య, నాయకులు మంచు వేణు, బెల్లంకొండ గోపి పాల్గొన్నారు.