మరో ఉద్యమానికి సిద్ధం కావాలి:మంద కృష్ణమాదిగ
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
నరసరావుపేట వెస్ట్: ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణ చేయించేలా మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు సమాయుత్తం కావాలంటూ సోమవారం సాయంత్రం భువనచంద్ర టౌన్‌హాలులో నిర్వహించిన సమాయుత్త సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో రాజకీయంగా అండగా ఉన్నది ఎమ్మార్పీఎస్‌యేనని కృష్ణమాదిగ అన్నారు. చంద్రబాబు పాదయాత్ర తెలంగాణలో జరిగేందుకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ అడ్డుకుంటే ఎమ్మార్పీఎస్ అండగా ఉండి పాదయాత్రను విజయవంతం చేసిందన్నారు. చంద్రబాబు చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో చొరవచూపాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. సెప్టెంబర్ 30లోపు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలకు నూతన కమిటీలు ఏర్పాటుచేస్తామన్నారు.
అక్టోబరు 1,2 తేదీల్లో రాజమండ్రిలో రెండు రాష్ట్రాల జాతీయ సదస్సును ఏర్పాటుచేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రొంపిచర్ల ఎంపీపీ మొండితోక రామారావు, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి నాగయ్యమాదిగ, జిల్లా కార్యదర్శి గుండాల నంద్, నియోజకవర్గ అధ్యక్షుడు మంద మార్క్, పట్టణ అధ్యక్షుడు దయాకర్, జిల్లా ఇన్‌చార్జి కూచిపూడి సత్యం, జిల్లా అధ్యక్షుడు పరిశెపోగు శ్రీను, బాబూరావు, మల్లవరపు బాబు, బుజ్జమ్మ తదితరులు మాట్లాడారు. తొలుత మంద కృష్ణమాదిగ విలేకరులతో మాట్లాడారు.