వర్గీకరణ చేసి తీరుతాం
- అప్పుడే మాదిగ కులాలకు న్యాయం
- ధర్మయుద్ధం మహాసభలో వెంకయ్యనాయుడు
- వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది
- మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం
- నేను ముందుండి నడిపిస్తా.. అవసరమైతే పోరాటం చేస్తా
- నోట్ల రద్దు సమస్య పెద్దగా లేదు
- ఉంటే ఈ సభకు ఇంతమంది వచ్చేవారే కాదు
- పార్లమెంట్లో వర్గీకరణపై బిల్లు పెడితే మద్దతు: సురవరం
సాక్షి, హైదరాబాద్
‘‘రాజ్యాంగం హక్కులు కల్పించినా మాదిగ కులాలకు ఆ ఫలాలు అందలేదు. దీంతో ఆ కులాలన్నీ ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనకబడ్డాయి. ఆ కులాలను ముందుకు తీసుకురావాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి. అందుకు బీజేపీ కట్టుబడి ఉంది. అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి. అయితే వర్గీకరణ అంశం సులువైంది కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లు పెట్టి చట్టాన్ని తీసుకురావాలి. ఈ ప్రక్రియను నేను ముందుండి నడిపిస్తా. అవసరమైతే పోరాటం చేస్తా..’’అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్సలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నేను మాట్లాడితే కొన్ని వర్గాలు నాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. దళిత కులాలను విభజిస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ నేను వర్గీకరణ ప్రక్రియను తప్పకుండా అమల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలన్న సందర్భంలో కొన్ని వర్గాలు హిందువులను విభజిస్తున్నారంటూ గోల చేశాయి. కానీ రిజర్వేషన్లు జరగకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అభివృద్ధి కొన్ని వర్గాలకే పరిమితమయ్యేది’’అని వెంకయ్య అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం కులాల మధ్య గొడవలు పెట్టడం లేదని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేందుకు కృషి చేస్తుందని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘‘నెల్లూరుకు వాజ్‌పేయి వచ్చినప్పుడు నేను మైకు పట్టుకుని ప్రకటనలు చేశా.. కానీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను పార్టీ పెద్దగా ఆయన పక్కన కూర్చున్నా. నేనెప్పుడూ అంతటి స్థానం అందుకుంటానని ఊహించలేదు. వర్గీకరణ ప్రక్రియ అమల్లోకి వస్తే మాదిగ ఉపకులాల ప్రజలు కూడా అత్యున్నత స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నా. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా తీసుకొచ్చేందుకు అన్ని పార్టీల సమ్మతికి ప్రయత్నిస్తా. మాదిగ కులాల కలలను సాకారం చేస్తా. బిల్లుకు సరికొత్త రూపు తీసుకొస్తా’’అని చెప్పారు.
నోట్ల సమస్య పెద్దగా లేదు
కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, దేశంలో ప్రతి అంశాన్ని సమూలంగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ క్రమంలోనే నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు పెద్దనోట్లను రద్దు చేశామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు సమస్య పెద్దగా లేదని, సమస్య ఉంటే ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు సభకు వచ్చేవారే కారన్నారు. దేశ ప్రజల ఆశలు త్వరలో ఫలిస్తాయని... ఒకేసారి వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పాసయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మాదిగ కులాలు చేస్తున్న వర్గీకరణ ఉద్యమం న్యాయమైందని, ఈ అంశంపై ప్రధానికి వివరిస్తానన్నారు. కేంద్ర సర్వీసుల్లో మాదిగ కులాలకు అన్యాయం జరుగుతోందని కొందరు తనను ప్రశ్నించారని, వర్గీకరణ అమలైతే ఈ సమస్య ఉండదని చెప్పారు.
ఇప్పటికే ఆలస్యమైంది: సురవరం
ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, దీంతో మాదిగ ఉపకులాల్లో మూడు తరాలకు పైగా నష్టపోయాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లు పెడితే దేశంలోని అన్ని వామపక్ష పార్టీలు మద్దతిస్తాయని ఆయన తెలిపారు. దళితులపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని, వీటిని ఆపేందుకు ప్రభుత్వాలు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. వర్గీకరణకు మాల కులాలు మద్దతుగా నిలవాలని, దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటే ఇతర వర్గాలు లాభపడతాయని, దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు.
కేసీఆర్‌కు నాపై కోపం వచ్చినట్టుంది..: మందకృష్ణ
‘‘ఈ సభకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు పలుమార్లు ప్రయత్నించా. ఈ రోజు మధ్యాహ్నం కూడా ట్రై చేశా. కానీ అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులతో చాలా ప్రయత్నం చేశా. కానీ వీలు చిక్కలేదు. నాపై ఎందుకు ఇంతటి కోపాన్ని పెంచుకున్నారో అర్థం కావడంలేదు. తెలంగాణకు దళితుడ్ని సీఎంగా చేస్తానని ఆయన అన్నారు. ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడిగా. అందుకు ఆయనకు నాపై కోపం వచ్చినట్లుంది. కోపముంటే నాపై చూపాలి. కానీ మా మాదిగ కులాల ఆశయాలపై రుద్దొద్దు..’అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఢిల్లీలో ఓ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పాదాభివందనం చేశా. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు చూశా. కానీ నాకు ఎవరి వద్ద బానిసత్వం చేయాల్సిన పనిలేదు.
వర్గీకరణ కోసం గత 22 ఏళ్లుగా వెంకయ్యనాయుడు నాకు సలహాలు, సూచనలిస్తూ ముందుకు నడిపించారు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల అధ్యక్షులతో మద్దతుగా లేఖలు ఇప్పించారు. నా మాదిగ కులాల ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా’’అని పేర్కొన్నారు. వెంకయ్య తనకు పెద్దన్న లాంటివారని, ఆయనకు పాదాభివందనం చేస్తే తప్పులేదని అన్నారు. సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ పక్షనేత జానారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ పక్షనేత కిషన్‌రెడ్డి, ఎంపీలు నంది ఎల్లయ్య, ఆనంద్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలివచ్చారు.