ప్రపంచ పర్యాటక స్థలంగా గండికోట! | we will make gandikota as world tourist place, says minister | Sakshi
Sakshi News home page

ప్రపంచ పర్యాటక స్థలంగా గండికోట!

Published Sat, Sep 26 2015 9:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

ప్రపంచ పర్యాటక స్థలంగా గండికోట!

ప్రపంచ పర్యాటక స్థలంగా గండికోట!

కడప : వైఎస్‌ఆర్ జిల్లాలోని గండికోటను ప్రపంచ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. గండికోటలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వారసత్వ ఉత్సవాలను శనివారం వారు ప్రారంభించారు. బ్రోచర్ ఆవిష్కరణ అనంతరం ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసే పర్యాటక సర్క్యూట్‌లో గండికోటను చేరుస్తామన్నారు. గండికోటలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని ఆయన కొనియాడారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రముఖ రాజులు, కోటల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఐటీ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పురాతన కట్టడాలు, కళలను ప్రజలు మరచి పోతున్నారని.. వాటికి పునర్‌వైభవం తీసుకువస్తామని చెప్పారు. ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి జనవరి 26, ఆగస్ట్ 15వ తేదీల్లో అవార్డులు అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతకు ముందు మంత్రులు గండికోటలోని జుమ్మా మసీదు, చార్మినార్, రంగనాయక స్వామి మండపం, పెన్నానది లోయను పరిశీలించారు. పెన్నా లోయపై స్కైవాక్ ఏర్పాటు చేసే విషయమై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కె.వి.రమణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జేసీ-2 కృష్ణభారతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement