ప్రకంపనలు
ప్రకంపనలు
Published Mon, Apr 3 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
– మంత్రివర్గ విస్తరణతో ‘అనంత’ టీడీపీలో రేగిన చిచ్చు
– రాజకీయాలను నుంచి తప్పుకునే యోచనలో ‘పల్లె’
– నేడు పుట్టపర్తిలో కార్యకర్తలతో సమావేశం..నిర్ణయం వెల్లడించే అవకాశం
– ఏ క్షణమైనా కఠిన నిర్ణయం తీసుకుంటానని సన్నిహితులతో చెప్పిన బీకే
– బీకేకు అండగా రాజీనామా చేసిన మార్కెట్‌యార్డు చైర్మన్, రొద్దం సింగిల్ విండో అధ్యక్షుడు
– బీకేకు అన్యాయం చేశారంటూ చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసిన కురుబసంఘం
– ‘కాలవ’కు పట్టం కట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న మెజార్టీ ఎమ్మెల్యేలు
సాక్షిప్రతినిధి, అనంతపురం
మంత్రివర్గ విస్తరణ ‘అనంత’ టీడీపీలో చిచ్చు రేపుతోంది. పార్టీకోసం సుదీర్ఘకాలం శ్రమించిన వారికి అధిష్టానం అన్యాయం చేసిందని పార్టీ సీనియర్ నేతలతో పాటు పలు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఏళ్లతరబడి పార్టీ జెండా మోసినా ప్రయోజనం లేనప్పుడు పార్టీలో ఎందుకు కొనసాగాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లె’ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పువాలనే నిర్ణయానికి రాగా ..టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ‘అనంత’ టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
తెలుగుదేశం పార్టీకి ‘అనంతపురం’ కంచుకోటలాంటిదని పలు సందర్భాల్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ పెనుకొండ నుంచి అనంతపురం వరకూ చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీకి 92 శాతం నష్టం వాటిల్లిందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ మాట వల్లె వేయడం మానేశారు. 2014 ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన అంశాన్ని పక్కనపెడితే ఈ మూడేళ్లలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పెనుకొండలో ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ధర్మవరంలో మంత్రి సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి, కదిరిలో ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట, అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, రాయదుర్గంలో కాలవ, మెట్టు గోవిందరెడ్డి, మడకశిరలో ఈరన్న, తిప్పేస్వామి...ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యపోరుతో పార్టీ కేడర్ చెల్లాచెదురైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2014 ఫలితాలు టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ‘రివర్స్’లో ఉంటాయని చంద్రబాబే స్వయంగా చేయించి సర్వేరిపోర్టు తేల్చిచెప్పింది.
మంత్రివర్గ విస్తరణతో మరింత కుదేలు
ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ పార్టీకి మరింత నష్టం కలిగిస్తోంది. సౌమ్యుడైన తనను మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని పల్లె రఘునాథరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకంటే అవమానం తనకు లేదని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని తన సన్నిహితుల్లో వాపోయినట్లు తెలుస్తోంది. సోమవారం పుట్టపర్తిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ‘పల్లె’ సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ‘పల్లె’కు మంత్రి పదవి ఇవ్వలేదని బుక్కపట్నం మండల టీడీపీ కార్యదర్శి గంగాధర్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు బీసీకోటాలో తనకు బెర్త్ దాదాపు ఖరారైందని 3 నెలలుగా తన సన్నిహితులతో బీకే పార్థసారథి చెబుతూ వచ్చారు. అయితే కాలవ శ్రీనివాసులకు ఇవ్వడంతో తీవ్ర నిర్వేదానికి లోనయ్యారు. పదేళ్లపాటు పార్టీ అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా తీవ్రంగా శ్రమించానని, కానీ కాలవకు ఇవ్వడమంటే పథకం ప్రకారమే తనను చంద్రబాబు పక్కనపెట్టారని తన సన్నిహితులతో బీకే వాపోయినట్లు తెలుస్తోంది. నేడో, రేపో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఆలోచిస్తామని కూడా పెనుకొండలోని తన సన్నిహితులతో బీకే చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షపదవి కూడా తనకు వద్దనే నిర్ణయానికి బీకే వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు బీకేకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా పెనుకొండ మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి వెంకట్రామిరెడ్డి, రొద్దం సింగిల్‌విండో అధ్యక్ష పదవికి ఆంజనేయులు రాజీనామా చేశారు. కురుబసంఘం యువజన విభాగం నేతలు ‘అనంత’లో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు.
అంతర్మథనంలో టీడీపీ ఎమ్మెల్యేలు
మంత్రివర్గ విస్తరణతో టీడీపీలోని ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కేడర్ అంతర్మథనంలో పడిపోయింది. పార్టీకోసం శ్రమించినవారిని పార్టీ ఎలా గుర్తిస్తోంది? కేవలం ‘సిఫార్సు’లకే పెద్దపీట వేసే పార్టీలో శక్తికిమించి శ్రమించాల్సిన అవసరం ఉందా? ఈరోజు పార్టీ సీనియర్లకు జరిగిన అన్యాయమే రేపు తమకూ జరగదనే గ్యారెంటీ ఏముందని పార్టీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ధర్మవరం, అనంతపురం, పెనుకొండ, తాడిపత్రి ఎమ్మెల్యేలతో పాటు ఉరవకొండ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి విస్తరణపై పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన ఈ పొరపాటు ఎంత తీవ్రమైందో ఇప్పటికిప్పుడు తెలీదని, మరో రెండేళ్లు టీడీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రథమ, ద్వితీయ శ్రేణి నేతలు నోరుమెదపలేరని, 2019లో పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఓ సీనియర్ నేత ‘సాక్షి’తో అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు కూడా చాలామంది ఆశించడం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే టీడీపీలో ఇప్పటి వరకూ చురుగ్గా పనిచేసిన నేతలు కాడి వదిలేసి, పార్టీ కార్యక్రమాల్లో ఇష్టంగా కాకుండా మొక్కుబడిగా పాల్గొంటారని తెలుస్తోంది. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Advertisement
Advertisement