bk partha sarathi
-
పార్థ.. అవినీతి మేత
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయ జీవితం..అంతా అక్రమాల కలబోతే.అవినీతి మేతే. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. రూ.కోట్లు మేసేశారు. ‘కియా’ ఏర్పాటు సమయంలో రైతులను నిండా ముంచేశారు. మైనింగ్, ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరి పోయారు. ఎమ్మెల్యేగా వెలగబెట్టినప్పుడే జనాన్ని నిండాముంచిన ఆ టీడీపీ నేత ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌కే పోటీ చేస్తున్నారు.సాక్షి, పుట్టపర్తి: బీకే పార్థసారథి.. టీడీపీలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. అవినీతి, అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. రౌడీలు, మద్యం అక్రమ రవాణా దారులు, మైనింగ్ మాఫియా వ్యక్తులను అనుచరులుగా చేర్చుకుని అడ్డదిడ్డంగా సంపాదించాడు. ‘కియా’ కార్ల పరిశ్రమ రాకతో ఎంతోమంది రైతులను మోసం చేశాడు. తక్కువ ధరలకే భూములు కాజేశాడు. కొందరికి పరిహారం ఇవ్వకుండా బెదిరించి లాక్కున్నాడు. గత టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ దోపిడీ చేశాడు. అల్లుడిని రంగంలోకి దింపి రూ.కోట్లు వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో పెనుకొండ ప్రజలు బీకేను ఘోరంగా ఓడించారు.కమీషన్ల కక్కుర్తి..‘కియా కార్ల పరిశ్రమ కోసం భూ సేకరణ, చదును పనుల్లో పార్థసారథి బాగా నొక్కేశాడు. ఎకరా భూమికి రైతుకు రూ.10.5 లక్షలు ఇస్తే.. భూమిని చదును చేయడానికి ఎకరాకు రూ.25 లక్షలు ఖర్చు ెచూపి.. కమీషన్లు తీసుకుని చంద్రబాబు.. లోకేశ్‌కు వాటా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇక సోమందేపల్లి సమీపంలోని పెద్దకొండ చాలా మహిమాన్వితమైందని స్థానికులు భావిస్తారు. అందుకే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరు. కానీ ఆ కొండకు అవతలి వైపు ఉన్న క్వారీలకు వెళ్లేందుకు బీకే పార్థసారథి పెద్దకొండపైనే రోడ్డు వేయించాడు. ఇందుకు గానూ క్వారీ నిర్వాహకులతో.. రూ.కోట్లు దండుకున్నాడనే ఆరోపణలున్నాయి.రైతుల పాలిట యముడిలా..‘కియా’ కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించకుండా.. బీకే సైంధవుడిలా అడ్డుపడ్డారు. గుట్టూరుకు చెందిన రైతు వడ్డే సుబ్బరాయుడు మరణానికి కారణమయ్యాడు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ‘కియా’ సమీపంలో రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా కొనుగోలు చేశారని, ఎందరో రైతులను మోసం చేశాడని వెంకటగిరిపాళ్యంకు చెందిన రైతులు పార్థసారథిపై పలుమార్లు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.తప్పులెన్ని చేసినా..సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద పార్థసారథి అల్లుడు శశిభూషణ్.. తన క్వారీలో ఓ కూలీపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. అయితే టీడీపీ పెద్దల సహకారంలో కేసు లేకుండా తప్పించుకున్నాడనే ఆరోపణలున్నాయి. బీకే పార్థసారథి అనుచరుడిగా ఎదిగిన సిద్ధయ్య చీప్ లిక్కర్ వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా నిత్యం సిద్ధయ్యను వెంట పెట్టుకుని పార్థసారథి పర్యటిస్తుంటారు. అలాగే బీకే వెంట నడిచే మరో మహిళ నేత కూడా నాటుసారా వ్యాపారం చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.ఎస్సీల భూముల్లో క్వారీటీడీపీ హయాంలో రొద్దం మండలం కంబాలపల్లి, శ్యాపురం గ్రామాల శివార్లలో బీకే క్వారీ నడిపేవాడు. ఇందుకు కొండ సమీపంలోని 16 మంది ఎస్సీ రైతులకు సంబంధించిన 40 ఎకరాల భూములను కాజేశాడు. ఏడాదికి ఎకరాకు రూ.4 వేలు ఇస్తానని నమ్మబలికాడు. లీజుకు ఇవ్వకుంటే లాగేసుకుంటామని బెదిరించాడు. చివరకు ఆ రైతుల భూములు సొంతం చేసుకున్నాడు.అల్లుడికి ఆరు శాతం కమీషన్లు..బీకే చేసే అక్రమార్జనలో ఆరు శాతం తన అల్లుడు శశిభూషణ్‌కు ఇస్తారు. గత టీడీపీ హయాంలో నుంచి ఈ దందా కొనసాగుతోంది. అందుకే అప్పట్లో నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా ముందు కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ దందా తట్టుకోలేక కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. దీంతో పెనుకొండ అభివృద్ధి కుంటుపడింది.ప్రజాధనం లూఠీ..టీడీపీ హయాంలో ‘స్వచ్ఛభారత్’ పథకం కింద పెనుకొండకు భారీగా మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే మరుగుదొడ్లు నిర్మించకుండానే బీకే పార్థసారథి బిల్లులు స్వాహా చేశాడు. అర్హులకు పథకం అందకుండా.. స్వచ్ఛభారత్ పథకానికి అప్పట్లోనే స్వస్తి పలికాడు. ‘నీరు–చెట్టు’ పథకంలో రూ.కోట్లు కొల్లగొట్టాడు. దీంతో ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు బీకేను ఘోరంగా ఓడించారు.రూ.వందల కోట్ల ఇసుక మేత..టీడీపీ హయాంలో పెనుకొండ పరిధిలోని పెన్నా, జయమంగళి, చిత్రావతి నది పరీవాహక ప్రాంతాలను బీకే పార్థసారథి చెర బట్టారు. రోజూ వందల ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తోడేశాడు. ఐదేళ్లలో ఇసుక అక్రమ రవాణా ద్వారానే రూ.500 కోట్లపైనే సంపాదించాడని టీడీపీ నేతలే చెబుతున్నారు. -
సిద్దయ్యా..ఇదేందయ్యా
శ్రీ సత్యసాయి: శెట్టిపల్లికి చెందిన దూదేకుల సిద్దయ్య మాజీ ఎమ్మెల్యే బీకే. పార్థసారథి ప్రధాన అనుచరుడు. పెనుకొండ టీడీపీ మండల కన్వీనర్‌గా ఉండేవాడు. కర్ణాటక మద్యం తరలిస్తూ అప్పట్లో పోలీసులకు పట్టుబడ్డాడు. రిమాండ్‌కు సైతం వెళ్లి వచ్చాడు. అయితే గతంలోనే బీఎడ్ పూర్తి చేసిన సిద్దయ్య 1998 డీఎస్సీలో అర్హత సాధించగా...ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ఇటీవల ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రొద్దం మండలంలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన ఆయన... శుక్రవారం పెనుకొండలో జరిగిన ‘భవిష్యత్‌కు టీడీపీ భరోసా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో కలిసి ఫొటోలు తీసుకుంటూ సంబరపడిపోయారు. సిద్దయ్య హడావుడి చూసిన టీడీపీ నేతలు ఇతను టీడీపీ సిద్దయ్యా.. -
మాధవ్ హోరు... బీకే బేజారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కురుబలు రాజకీయంగా ఎదగకూడదన్నది టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సిద్ధాంతం. ఆ సామాజిక వర్గంలో అన్నీ తానై వ్యవహరించాలన్నది ఆయన లక్ష్యం. కురుబ సామాజిక వర్గమంతా తనకే మద్దతు పలకాన్నది ఆయన ప్లాన్.. కానీ ఆదివారం నగరంలో జరిగిన కురుబ గర్జనలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. సీఐ మాధవ్ సభ ప్రాంగణానికి రాగానే జనం ఈలలతో హోరెత్తించారు. దీన్ని చూసి తట్టుకోలేని బీకే పార్థసారథి ప్రశాంతంగా సాగుతున్న ‘కురుబగర్జన’లో వివాదాన్ని రగిల్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఆదివారం జూనియర్ కాలేజీ మైదానంలో ‘కురుబగర్జన’లో సీఐ గోరంట్ల మాధవ్ కన్పించగానే 15 నిమిషాల పాటు ఈలలు, కేకలతో సభ హోరెత్తింది. మాధవ్ క్రేజ్ చూసి తట్టుకోలేక అక్కసుతో పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి నోరుపారేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు గర్జనకు ముఖ్య అతిథిగా వచ్చిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా మాట్లాడకుండానే వెనుదిరిగారంటే పార్థసారథి సభను ఏరకంగా తప్పుదోవ పట్టించారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో పార్థసారథి వైఖరిని కురుబలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనకు బుద్ధి లేదు.. పిల్లాట ఆడతారు కురబ సమావేశం జరుగుతున్నపుడు మాధవ్‌ను వేదికపై పిలవలేదు. సమావేశం ప్రారంభమైన తర్వాత కులాభిమానంతో సామాన్య కురుబ వ్యక్తిగా సమావేశం చూడాలని మాధవ్ వేదిక ముందు కూర్చునేందుకు రాబోయారు. మాధవ్ కన్పించగానే జనాలు భూజాలపైకి ఎత్తుకుని ఈలలు, కేకలు వేస్తూ ‘కురుబల సింహం మాధవ్ జిందాబాద్’ అంటూ వేదిక వద్దకు తీసుకురాబోయారు. ఈ సమయంలోప్రసంగిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ ప్రసంగం ఆపి అలా చూస్తుండిపోయారు. అతను ఎవరని సిద్ధరామయ్య పక్కన వారిని అడిగి తెలుసుకున్నారు. జనాల ఆపకుండా ఈలలు, కేకలు వేయడంతో టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి తట్టుకోలేక తన అక్కసు వెళ్లగక్కారు. మైకు తీసుకుని ‘ఏయ్ ఏమయ్యా! మీరందరూ...సహకరించాలి. ఆయన్ను వదిలేయండి..కోతికి కళ్లుతాపితే ఎలా? బుద్ధిలేదా?’ అన్నారు. అయినా జనహోరు ఆగలేదు. ‘కురబ టైగర్ గోరంట్ల మాధవ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభకు వచ్చిన కురుబలను ‘మీరంతా అల్లరిమూకలా? ఆయనకు బుద్ధిలేదు, పిల్ల ఆట ఆడతారు, అతన్ని అవతలికి పొమ్మను. ఇట్టా రాజకీయాలు పనికిరావు, రేవణ్ణ మాట్లాడతారు, సహకరించండి’ అని బీకే అన్నారు. అయినప్పటికీ జనాలు స్పందించలేదు. బీకే పార్థసారథి తనపై పరుష వ్యాఖ్యలు చేసినా మాధవ్ హుందాగా అందరికీ నమస్కారం చేసి వెనుదిరిగారు. కానీ వేదికపై రావాలని జనాలు మళ్లీ పట్టుబట్టారు. దీంతో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ జోక్యం చేసుకుని మాధవ్ వేదికపైకి రావాలని పిలిచారు. అప్పుడు తిరిగి ప్రజలంతా మాధవ్‌ను భుజాలపై ఎత్తుకుని వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేదిక ఎక్కిన మాధవ్ అభివాదం చేయగా... సభమొత్తం హోరెత్తింది. మాధవ్కున్న క్రేజ్‌ను సిద్ధరామయ్య, రేవణ్ణతో పాటు వేదికపై ఉన్నవారంతా అలా చూస్తూ ఉండిపోయారు. అనంతరం బీకే వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య వెళ్లిపోయారు. భోజనానికి వెళ్లారని, వస్తారని వేదికపై ఉన్నవారు చెప్పారు. బీకే పార్థసారథి కూడా వేదిక దిగి వెళ్లిపోవడంతో మాధవ్ కూడా వెళ్లిపోయారు. బీకే తీరుపై కురుబల ఆగ్రహం అయితే సాటి కురుబ వ్యక్తికి ఉన్న ప్రజాస్పందన చూసి ఎమ్మెల్యే బీకే∙ఓర్వలేకపోయారని, అలాంటపుడు కురబల్లో ఎక్కడ ఐక్యత ఉంటుందనీ, కురుబల్లో ఆయన తప్ప మరొకరు ఎదగకూడదనే వైఖరి బీకేలో ఉందని సభకు వచ్చినవారంతా చర్చించుకున్నారు. -
ప్రకంపనలు
– మంత్రివర్గ విస్తరణతో ‘అనంత’ టీడీపీలో రేగిన చిచ్చు – రాజకీయాలను నుంచి తప్పుకునే యోచనలో ‘పల్లె’ – నేడు పుట్టపర్తిలో కార్యకర్తలతో సమావేశం..నిర్ణయం వెల్లడించే అవకాశం – ఏ క్షణమైనా కఠిన నిర్ణయం తీసుకుంటానని సన్నిహితులతో చెప్పిన బీకే – బీకేకు అండగా రాజీనామా చేసిన మార్కెట్‌యార్డు చైర్మన్, రొద్దం సింగిల్ విండో అధ్యక్షుడు – బీకేకు అన్యాయం చేశారంటూ చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసిన కురుబసంఘం – ‘కాలవ’కు పట్టం కట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న మెజార్టీ ఎమ్మెల్యేలు సాక్షిప్రతినిధి, అనంతపురం మంత్రివర్గ విస్తరణ ‘అనంత’ టీడీపీలో చిచ్చు రేపుతోంది. పార్టీకోసం సుదీర్ఘకాలం శ్రమించిన వారికి అధిష్టానం అన్యాయం చేసిందని పార్టీ సీనియర్ నేతలతో పాటు పలు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఏళ్లతరబడి పార్టీ జెండా మోసినా ప్రయోజనం లేనప్పుడు పార్టీలో ఎందుకు కొనసాగాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లె’ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పువాలనే నిర్ణయానికి రాగా ..టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ‘అనంత’ టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలుగుదేశం పార్టీకి ‘అనంతపురం’ కంచుకోటలాంటిదని పలు సందర్భాల్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ పెనుకొండ నుంచి అనంతపురం వరకూ చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీకి 92 శాతం నష్టం వాటిల్లిందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ మాట వల్లె వేయడం మానేశారు. 2014 ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన అంశాన్ని పక్కనపెడితే ఈ మూడేళ్లలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పెనుకొండలో ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ధర్మవరంలో మంత్రి సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి, కదిరిలో ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట, అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, రాయదుర్గంలో కాలవ, మెట్టు గోవిందరెడ్డి, మడకశిరలో ఈరన్న, తిప్పేస్వామి...ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యపోరుతో పార్టీ కేడర్ చెల్లాచెదురైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2014 ఫలితాలు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ‘రివర్స్’లో ఉంటాయని చంద్రబాబే స్వయంగా చేయించి సర్వేరిపోర్టు తేల్చిచెప్పింది. మంత్రివర్గ విస్తరణతో మరింత కుదేలు ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ పార్టీకి మరింత నష్టం కలిగిస్తోంది. సౌమ్యుడైన తనను మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని పల్లె రఘునాథరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకంటే అవమానం తనకు లేదని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని తన సన్నిహితుల్లో వాపోయినట్లు తెలుస్తోంది. సోమవారం పుట్టపర్తిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ‘పల్లె’ సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ‘పల్లె’కు మంత్రి పదవి ఇవ్వలేదని బుక్కపట్నం మండల టీడీపీ కార్యదర్శి గంగాధర్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు బీసీకోటాలో తనకు బెర్త్ దాదాపు ఖరారైందని 3 నెలలుగా తన సన్నిహితులతో బీకే పార్థసారథి చెబుతూ వచ్చారు. అయితే కాలవ శ్రీనివాసులకు ఇవ్వడంతో తీవ్ర నిర్వేదానికి లోనయ్యారు. పదేళ్లపాటు పార్టీ అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా తీవ్రంగా శ్రమించానని, కానీ కాలవకు ఇవ్వడమంటే పథకం ప్రకారమే తనను చంద్రబాబు పక్కనపెట్టారని తన సన్నిహితులతో బీకే వాపోయినట్లు తెలుస్తోంది. నేడో, రేపో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఆలోచిస్తామని కూడా పెనుకొండలోని తన సన్నిహితులతో బీకే చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షపదవి కూడా తనకు వద్దనే నిర్ణయానికి బీకే వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు బీకేకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా పెనుకొండ మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి వెంకట్రామిరెడ్డి, రొద్దం సింగిల్‌విండో అధ్యక్ష పదవికి ఆంజనేయులు రాజీనామా చేశారు. కురుబసంఘం యువజన విభాగం నేతలు ‘అనంత’లో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. అంతర్మథనంలో టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణతో టీడీపీలోని ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కేడర్ అంతర్మథనంలో పడిపోయింది. పార్టీకోసం శ్రమించినవారిని పార్టీ ఎలా గుర్తిస్తోంది? కేవలం ‘సిఫార్సు’లకే పెద్దపీట వేసే పార్టీలో శక్తికిమించి శ్రమించాల్సిన అవసరం ఉందా? ఈరోజు పార్టీ సీనియర్లకు జరిగిన అన్యాయమే రేపు తమకూ జరగదనే గ్యారెంటీ ఏముందని పార్టీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ధర్మవరం, అనంతపురం, పెనుకొండ, తాడిపత్రి ఎమ్మెల్యేలతో పాటు ఉరవకొండ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి విస్తరణపై పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన ఈ పొరపాటు ఎంత తీవ్రమైందో ఇప్పటికిప్పుడు తెలీదని, మరో రెండేళ్లు టీడీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రథమ, ద్వితీయ శ్రేణి నేతలు నోరుమెదపలేరని, 2019లో పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఓ సీనియర్ నేత ‘సాక్షి’తో అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు కూడా చాలామంది ఆశించడం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే టీడీపీలో ఇప్పటి వరకూ చురుగ్గా పనిచేసిన నేతలు కాడి వదిలేసి, పార్టీ కార్యక్రమాల్లో ఇష్టంగా కాకుండా మొక్కుబడిగా పాల్గొంటారని తెలుస్తోంది. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.