సభకు హాజరైన కురుబలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కురుబలు రాజకీయంగా ఎదగకూడదన్నది టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సిద్ధాంతం. ఆ సామాజిక వర్గంలో అన్నీ తానై వ్యవహరించాలన్నది ఆయన లక్ష్యం. కురుబ సామాజిక వర్గమంతా తనకే మద్దతు పలకాన్నది ఆయన ప్లాన్.. కానీ ఆదివారం నగరంలో జరిగిన కురుబ గర్జనలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. సీఐ మాధవ్ సభ ప్రాంగణానికి రాగానే జనం ఈలలతో హోరెత్తించారు. దీన్ని చూసి తట్టుకోలేని బీకే పార్థసారథి ప్రశాంతంగా సాగుతున్న ‘కురుబగర్జన’లో వివాదాన్ని రగిల్చారు.
ఇంతకీ ఏం జరిగిందంటే...
ఆదివారం జూనియర్ కాలేజీ మైదానంలో ‘కురుబగర్జన’లో సీఐ గోరంట్ల మాధవ్ కన్పించగానే 15 నిమిషాల పాటు ఈలలు, కేకలతో సభ హోరెత్తింది. మాధవ్ క్రేజ్ చూసి తట్టుకోలేక అక్కసుతో పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి నోరుపారేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు గర్జనకు ముఖ్య అతిథిగా వచ్చిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా మాట్లాడకుండానే వెనుదిరిగారంటే పార్థసారథి సభను ఏరకంగా తప్పుదోవ పట్టించారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో పార్థసారథి వైఖరిని కురుబలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఆయనకు బుద్ధి లేదు.. పిల్లాట ఆడతారు
కురబ సమావేశం జరుగుతున్నపుడు మాధవ్‌ను వేదికపై పిలవలేదు. సమావేశం ప్రారంభమైన తర్వాత కులాభిమానంతో సామాన్య కురుబ వ్యక్తిగా సమావేశం చూడాలని మాధవ్ వేదిక ముందు కూర్చునేందుకు రాబోయారు. మాధవ్ కన్పించగానే జనాలు భూజాలపైకి ఎత్తుకుని ఈలలు, కేకలు వేస్తూ ‘కురుబల సింహం మాధవ్ జిందాబాద్’ అంటూ వేదిక వద్దకు తీసుకురాబోయారు. ఈ సమయంలోప్రసంగిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ ప్రసంగం ఆపి అలా చూస్తుండిపోయారు. అతను ఎవరని సిద్ధరామయ్య పక్కన వారిని అడిగి తెలుసుకున్నారు. జనాల ఆపకుండా ఈలలు, కేకలు వేయడంతో టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి తట్టుకోలేక తన అక్కసు వెళ్లగక్కారు. మైకు తీసుకుని ‘ఏయ్ ఏమయ్యా! మీరందరూ...సహకరించాలి. ఆయన్ను వదిలేయండి..కోతికి కళ్లుతాపితే ఎలా? బుద్ధిలేదా?’ అన్నారు. అయినా జనహోరు ఆగలేదు. ‘కురబ టైగర్ గోరంట్ల మాధవ్’ అంటూ నినాదాలు చేశారు.
దీంతో సభకు వచ్చిన కురుబలను ‘మీరంతా అల్లరిమూకలా? ఆయనకు బుద్ధిలేదు, పిల్ల ఆట ఆడతారు, అతన్ని అవతలికి పొమ్మను. ఇట్టా రాజకీయాలు పనికిరావు, రేవణ్ణ మాట్లాడతారు, సహకరించండి’ అని బీకే అన్నారు. అయినప్పటికీ జనాలు స్పందించలేదు. బీకే పార్థసారథి తనపై పరుష వ్యాఖ్యలు చేసినా మాధవ్ హుందాగా అందరికీ నమస్కారం చేసి వెనుదిరిగారు. కానీ వేదికపై రావాలని జనాలు మళ్లీ పట్టుబట్టారు. దీంతో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ జోక్యం చేసుకుని మాధవ్ వేదికపైకి రావాలని పిలిచారు. అప్పుడు తిరిగి ప్రజలంతా మాధవ్‌ను భుజాలపై ఎత్తుకుని వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేదిక ఎక్కిన మాధవ్ అభివాదం చేయగా... సభమొత్తం హోరెత్తింది. మాధవ్‌కున్న క్రేజ్‌ను సిద్ధరామయ్య, రేవణ్ణతో పాటు వేదికపై ఉన్నవారంతా అలా చూస్తూ ఉండిపోయారు. అనంతరం బీకే వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య వెళ్లిపోయారు. భోజనానికి వెళ్లారని, వస్తారని వేదికపై ఉన్నవారు చెప్పారు. బీకే పార్థసారథి కూడా వేదిక దిగి వెళ్లిపోవడంతో మాధవ్ కూడా వెళ్లిపోయారు.
బీకే తీరుపై కురుబల ఆగ్రహం
అయితే సాటి కురుబ వ్యక్తికి ఉన్న ప్రజాస్పందన చూసి ఎమ్మెల్యే బీకే∙ఓర్వలేకపోయారని, అలాంటపుడు కురబల్లో ఎక్కడ ఐక్యత ఉంటుందనీ, కురుబల్లో ఆయన తప్ప మరొకరు ఎదగకూడదనే వైఖరి బీకేలో ఉందని సభకు వచ్చినవారంతా చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment