టీడీపీ హయాంలో ఊరూరా అక్రమాలు
పెనుకొండ పరిధిలో భారీ భూదందా
నీరు–చెట్టు, మరుగుదొడ్ల బిల్లుల స్వాహా
రూ.వందల కోట్ల ఇసుక దోపిడీ
‘కియా’ ఏర్పాటు సమయంలో రైతులకు టోకరా
బీకే అండతో అల్లుడు శశిభూషణ్ అక్రమాలెన్నో
వ్యతిరేకించిన పెనుకొండ వాసులు
ఈసారి ఎంపీ సీటిచ్చిన చంద్రబాబు
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయ జీవితం..అంతా అక్రమాల కలబోతే.అవినీతి మేతే. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. రూ.కోట్లు మేసేశారు. ‘కియా’ ఏర్పాటు సమయంలో రైతులను నిండా ముంచేశారు. మైనింగ్, ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరి పోయారు. ఎమ్మెల్యేగా వెలగబెట్టినప్పుడే జనాన్ని నిండాముంచిన ఆ టీడీపీ నేత ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌కే పోటీ చేస్తున్నారు.
సాక్షి, పుట్టపర్తి: బీకే పార్థసారథి.. టీడీపీలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. అవినీతి, అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. రౌడీలు, మద్యం అక్రమ రవాణా దారులు, మైనింగ్ మాఫియా వ్యక్తులను అనుచరులుగా చేర్చుకుని అడ్డదిడ్డంగా సంపాదించాడు. ‘కియా’ కార్ల పరిశ్రమ రాకతో ఎంతోమంది రైతులను మోసం చేశాడు. తక్కువ ధరలకే భూములు కాజేశాడు. కొందరికి పరిహారం ఇవ్వకుండా బెదిరించి లాక్కున్నాడు. గత టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ దోపిడీ చేశాడు. అల్లుడిని రంగంలోకి దింపి రూ.కోట్లు వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో పెనుకొండ ప్రజలు బీకేను ఘోరంగా ఓడించారు.
కమీషన్ల కక్కుర్తి..
‘కియా కార్ల పరిశ్రమ కోసం భూ సేకరణ, చదును పనుల్లో పార్థసారథి బాగా నొక్కేశాడు. ఎకరా భూమికి రైతుకు రూ.10.5 లక్షలు ఇస్తే.. భూమిని చదును చేయడానికి ఎకరాకు రూ.25 లక్షలు ఖర్చు ెచూపి.. కమీషన్లు తీసుకుని చంద్రబాబు.. లోకేశ్‌కు వాటా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇక సోమందేపల్లి సమీపంలోని పెద్దకొండ చాలా మహిమాన్వితమైందని స్థానికులు భావిస్తారు. అందుకే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరు. కానీ ఆ కొండకు అవతలి వైపు ఉన్న క్వారీలకు వెళ్లేందుకు బీకే పార్థసారథి పెద్దకొండపైనే రోడ్డు వేయించాడు. ఇందుకు గానూ క్వారీ నిర్వాహకులతో.. రూ.కోట్లు దండుకున్నాడనే ఆరోపణలున్నాయి.
రైతుల పాలిట యముడిలా..
‘కియా’ కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించకుండా.. బీకే సైంధవుడిలా అడ్డుపడ్డారు. గుట్టూరుకు చెందిన రైతు వడ్డే సుబ్బరాయుడు మరణానికి కారణమయ్యాడు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ‘కియా’ సమీపంలో రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా కొనుగోలు చేశారని, ఎందరో రైతులను మోసం చేశాడని వెంకటగిరిపాళ్యంకు చెందిన రైతులు పార్థసారథిపై పలుమార్లు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
తప్పులెన్ని చేసినా..
సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద పార్థసారథి అల్లుడు శశిభూషణ్.. తన క్వారీలో ఓ కూలీపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. అయితే టీడీపీ పెద్దల సహకారంలో కేసు లేకుండా తప్పించుకున్నాడనే ఆరోపణలున్నాయి. బీకే పార్థసారథి అనుచరుడిగా ఎదిగిన సిద్ధయ్య చీప్ లిక్కర్ వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా నిత్యం సిద్ధయ్యను వెంట పెట్టుకుని పార్థసారథి పర్యటిస్తుంటారు. అలాగే బీకే వెంట నడిచే మరో మహిళ నేత కూడా నాటుసారా వ్యాపారం చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఎస్సీల భూముల్లో క్వారీ
టీడీపీ హయాంలో రొద్దం మండలం కంబాలపల్లి, శ్యాపురం గ్రామాల శివార్లలో బీకే క్వారీ నడిపేవాడు. ఇందుకు కొండ సమీపంలోని 16 మంది ఎస్సీ రైతులకు సంబంధించిన 40 ఎకరాల భూములను కాజేశాడు. ఏడాదికి ఎకరాకు రూ.4 వేలు ఇస్తానని నమ్మబలికాడు. లీజుకు ఇవ్వకుంటే లాగేసుకుంటామని బెదిరించాడు. చివరకు ఆ రైతుల భూములు సొంతం చేసుకున్నాడు.
అల్లుడికి ఆరు శాతం కమీషన్లు..
బీకే చేసే అక్రమార్జనలో ఆరు శాతం తన అల్లుడు శశిభూషణ్‌కు ఇస్తారు. గత టీడీపీ హయాంలో నుంచి ఈ దందా కొనసాగుతోంది. అందుకే అప్పట్లో నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా ముందు కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ దందా తట్టుకోలేక కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. దీంతో పెనుకొండ అభివృద్ధి కుంటుపడింది.
ప్రజాధనం లూఠీ..
టీడీపీ హయాంలో ‘స్వచ్ఛభారత్’ పథకం కింద పెనుకొండకు భారీగా మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే మరుగుదొడ్లు నిర్మించకుండానే బీకే పార్థసారథి బిల్లులు స్వాహా చేశాడు. అర్హులకు పథకం అందకుండా.. స్వచ్ఛభారత్ పథకానికి అప్పట్లోనే స్వస్తి పలికాడు. ‘నీరు–చెట్టు’ పథకంలో రూ.కోట్లు కొల్లగొట్టాడు. దీంతో ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు బీకేను ఘోరంగా ఓడించారు.
రూ.వందల కోట్ల ఇసుక మేత..
టీడీపీ హయాంలో పెనుకొండ పరిధిలోని పెన్నా, జయమంగళి, చిత్రావతి నది పరీవాహక ప్రాంతాలను బీకే పార్థసారథి చెర బట్టారు. రోజూ వందల ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తోడేశాడు. ఐదేళ్లలో ఇసుక అక్రమ రవాణా ద్వారానే రూ.500 కోట్లపైనే సంపాదించాడని టీడీపీ నేతలే చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment