అగ్ని ప్రమోదం!
మృత్యువుకు ఆహ్వానం
- అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే నిర్మాణాలు
- ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి
- దాడులు నిర్వహించని అధికారులు
- ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయం
- నిర్మాణాల సమాచారం లేని అగ్నిమాపక శాఖ
- గతనెల 25న ఆలమూరు రోడ్డులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన బాలాజీ కళాశాలలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వంద కంప్యూటర్లు, ఏసీలు దగ్ధమయ్యాయి.
- గత నెల 24న మారుతీనగర్‌లోని శ్రీచైతన్య స్కూల్ రెండవ అంతస్తులో షార్టు సర్క్యూట్ జరిగింది. వెంటనే విద్యార్థులను బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
- ఈ రెండు యాజమాన్యాలు తొలుత ఫైర్‌సేఫ్టీ అనుమతి పొందినా రెన్యూవల్ చేసుకోకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది.
అగ్నిమాపక శాఖ అనుమతులు ఇలా..
సంస్థ మొత్తం అనుమతి
సినిమాల్స్ 75 28
ఫంక్షన్‌హాల్స్ 330 3
హాస్పటల్స్ 434 46
ప్రై వేటు స్కూల్స్ 1350 828
కోల్డ్ స్టోరేజస్ 11 1
పరిశ్రమలు 198 22
అనంతపురం సెంట్రల్: బహుల అంతస్తుల భవనాలు.. సినిమా హాళ్లు.. స్కూళ్లు.. హాస్పిటళ్ల నిర్మాణం చూస్తే కళ్లు చెదరాల్సిందే. బయటకు చూడచక్కగా కనిపించే వీటిలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే బయటపడటం కష్టమే. ఎందుకంటే.. అధిక శాతం నిర్మాణాల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటిస్తున్న దాఖలాల్లేవు. కొందరు అనుమతి తీసుకుంటున్నా.. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చిన్న ప్రమాదం జరిగినా నియంత్రించే సామగ్రి లేకపోవడంతో ప్రజల ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. లక్షలాది రూపాయలతో వ్యాపారం చేస్తున్నా.. కనీస ప్రమాణాలను విస్మరించడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందోననే చర్చ జరుగుతోంది. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గుడ్లప్పగించి చూస్తున్న అగ్నిమాపకశాఖ
జిల్లాలో ఎలాంటి అనుమతుల్లేని నిర్మాణాల విషయంలో అగ్నిమాపక శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సంస్థలపై ఎలాంటి దాడులు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉండటంతో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోకుండానే యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇటీవల శ్రీచైతన్య స్కూల్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పరిశీలిస్తే.. యాజమాన్యం పిల్లల భవిష్యత్తుతో ఎలా చెలగాటం ఆడుతుందో అర్థమవుతోంది. సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినా.. అగ్నిమాపక శాఖ అధికారులు ఇప్పటికీ పట్టించుకోకపోవడం వెనుక ముడుపుల వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ పై అంస్తుల నుంచి దిగేందుకు ఒకే మెట్ల మార్గం ఉంది. ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమవుతోంది. జిల్లాలోని చాలా వరకు ప్రయివేట్ స్కూళ్లు.. కార్పొరేట్, ప్రయివేట్ హాస్పిటళ్లు ఫైర్‌సేఫ్టీ అనుమతి తీసుకోకపోయినా అధికారులు దాడులు నిర్వహించకపోవడం గమనార్హం. ఏటా ఏప్రిల్ 14 నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ వారోత్సవాల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నకు సమాధానం కరువయింది.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమి
అగ్నిమాపకశాఖతో మిగిలిన ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. అనుమతులు ఇచ్చేటప్పుడు అగ్నిమాపకశాఖ నిబంధనలు పాటిస్తున్నారా? అనుమతి పొందారా అనే వివరాలు తెలుసుకోవట్లేదు. భవంతులు, ప్రైవేటు స్కూళ్లు, హాస్పటళ్లలో ఫైర్‌సేఫ్టీ పాటించకపోయినా ఆ శాఖల అధికారులు అనుమతులు ఇస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఎన్ని ప్రైవేటు స్కూళ్లు, హాస్పిటళ్లు, సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయనే సమాచారం కూడా అగ్నిమాపక శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. అనేకమార్లు ఆయా శాఖల అధికారులకు లేఖలు పంపినా స్పందన కరువయిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అగ్నిమాపశాఖ అధికారుల వద్దకు వచ్చిన వారికి మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. తక్కిన సమయాల్లో అధికారులు తనిఖీలు చేయడం.. కేసులు నమోదు చేయకపోవడంతో భవంతులు మృత్యువుకు ఆహ్వానం పలుకుతున్నాయి.
చర్యలు తప్పవు
జిల్లాలో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోని సంస్థలను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. జన సందోహం ఉండే ప్రతి ఒక్క హాస్పిటల్, స్కూల్, సినిమా హాల్, పరిశ్రమలు తప్పనిసరిగా అనుమతి పొందాలి. లేకపోతే చర్యలు తప్పవు.
- కె.సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి.