నిండా మునిగాం
- కన్నబాబు,చింతలపూడి వేదన
- పంచకర్ల,అవంతి తీరూ అంతే
- గంటా తీరుపై గరం గరం
సాక్షి, విశాఖపట్నం : పది మంది బాగు కోసం ఒకర్ని చంపడానికైనా లేదా చావడానికైనా.. సిద్ధం! ఇది ఓ హిట్ సినిమా డైలాగ్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరు దీనికి పూర్తిగా వ్యతిరేకం. నలుగుర్ని ఇబ్బందిపెట్టయినా తను బాగుపడితే చాలనుకుంటారు. ఇదీ ప్రస్తుతం ఆయన్ని నమ్మి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల ఆవేదన. తనకు నచ్చిన స్థానాన్ని దక్కించుకుని,ఆయన వెం ట నడిచిన తమను మాత్రం నట్టేట ముంచారంటూ వీరు వాపోతున్నారు. ఎన్నికలకో పార్టీని/స్థానాన్ని మార్చే ఆయన తీరును ఇప్పటికి గుర్తించగలిగామని చెప్తున్నారు.
గంటాను పూర్తిగా నమ్మి,ఆయనపైనే భారం వేసిన ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబులకు టీడీపీలో స్థానం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు,పంచకర్ల రమేష్‌బాబులు గంటా వెంట పార్టీలో చేరినా తమ ‘అర్థ’బలాన్ని నమ్ముకున్నారు. దీనికి ప్రతిఫలంగా అవంతికి అనకాపల్లి లోక్‌సభ, పంచకర్లకు యలమంచిలి అసెంబ్లీ కేటాయించేందుకు అధిష్టానం అంగీకరించినట్టు తెలిసింది.
గంటా పుణ్యమా అని అనకాపల్లిలో పార్టీ శ్రేణులు పూర్తి వ్యతిరేకతతో ఉన్నాయి. అవంతికి కేటాయించారన్న వార్తలొచ్చిన వెంటనే అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి విధ్వంసం సృష్టించారు. యలమంచిలిలో కూడా ఇదే పరిస్థితి. తనకు కనీస అవగాహనలేని ప్రాంతాన్ని కేటాయిస్తే ఎలా నెగ్గుకొచ్చేదని పంచకర్ల ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెపైచ్చు ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్న సుందరపు విజయ్‌కుమార్ వర్గం పార్టీకి వ్యతిరేకంగా ఆదివారం ఆందోళనకు దిగింది. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, రోడ్డుపై బైఠాయించారు.
కిరోసిన్ పోసుకుని కొందరు ఆత్మహత్యాయత్న హెచ్చరికలు కూడా చేశారు. చింతలపూడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నారు. కన్నబాబు కూడా ప్రత్యామ్నాయాల ఆలోచనల్లో ఉన్నారు. ఇంకా అనకాపల్లి లోక్‌సభ, అసెంబ్లీ, భీమిలి, యలమంచిలి స్థానాలపై అధికారిక ప్రకటన రాకముందే పరిస్థితి ఇలా ఉంటే అభ్యర్థుల్ని ప్రకటిస్తే పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో నెలకొంది.
మరోవైపు నగరంలో ఉన్న గంటా ఇంటి ముందు అనకాపల్లికి చెందిన కొందరు కార్యకర్తలు గంటా అనకాపల్లిలోనే పోటీచేయాలంటూ ఆదివారం నినాదాలు చేశారు. ఎన్నికలకో నియోజకవర్గం మార్చే గంటా శ్రీనివాసరావు అనకాపల్లిలో తన చరిష్మా తగ్గలేదని నిరూపించుకునేందకు ఈ ఎత్తుగడ వేశారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు.