ఇద్దరికి చోటు
- జిల్లా నుంచి కేబినెట్ మంత్రులుగా అయ్యన్న, గంటా
- సీనియార్టీ, కుల సమీకరణల ప్రాధాన్యంగా ఎంపిక
- సోమవారం నాటికి తేలనున్న శాఖలు
- పదవి రాక బండారు అలక
సాక్షి, విశాఖపట్నం: జిల్లా టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు కేబినెట్ మంత్రులయ్యారు. చంద్రబాబు తన మంత్రి వర్గంలో వీరిద్దరికి చోటిచ్చారు. పదవులు దక్కించుకున్నవీరిద్దరిలో అయ్యన్నపాత్రుడు సీనియర్ నేత కాగా, గంటా ఒకసారి పార్టీని వీడి తిరిగి ఎన్నికల ముందు చేరారు. ముందు నుంచీ ఊహించినట్లుగానే వీరిద్దరికి పదవులు దక్కాయి. వీరిద్దరికీ ఏ శాఖలు కేటాయిస్తారన్నది సోమవారం తేలుతుంది. మరో పక్క శనివారం అర్ధరాత్రి వరకు జిల్లా నుంచి మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత రాలేదు.
చంద్రబాబు నుంచి ఫోన్ వస్తుందని అయ్యన్నపాత్రుడు, గంటా, బండారు సత్యనారాయణలు ఆశించారు. వీరిలో అయ్యన్నపాత్రుడు, గంటాకు చంద్రబాబు ఆదివారం ఉదయం స్వయంగా ఫోన్ చేసి మంత్రి పదవుల గురించి సమాచారం ఇచ్చారు. మరో సీనియర్ నేత బండారుకు మాత్రం మొండి చేయి చూపించారు. అయ్యన్నపాత్రుడుది తనది ఒకే సామాజికవర్గం కావడం, పైగా సౌమ్యుడిగా పేరున్నందున తనకే పదవి వరిస్తుందని ఈయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
తీరా పదవి దక్కకపోవడంతో ఆయన అలిగినట్లు తెలిసింది. మరోపక్క మంత్రి పదవుల కేటాయింపులో సీనియార్టీ, కులసమీకరణలను ఆధారంగా చేసుకుని చంద్రబాబు ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. పార్టీలో అత్యంత సీనియర్ కూడా. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆరుసార్లు విజయం సాధించారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న నేతగా ఈయనకు రికార్డు ఉంది. కాని 2009 ఎన్నికల్లో ఓటిమిపాలవగా, తిరిగి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1984-1986 మధ్య సాంకేతిక విద్యాశాఖ , 1994-1996 మధ్యలో రహదారులు భవనాలు, పోర్టుల శాఖ,1999-2004 అటవీ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఈ నేపథ్యంలో సీనియార్టీ ప్రాతిపదికన అయ్యన్నకు బాబు మంత్రి వర్గంలో చోటిచ్చారు. మరో నేత గంటా శ్రీనివాసరావు 1999లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆతర్వాత 2004 ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీస్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీలోకి చేరి అనకాపల్లి అసెంబ్లీ సీటుకు పోటీచేసి గెలిచారు.
తిరిగి 2014 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ను వీడి మళ్లీ టీడీపీలో చేరారు. ఈ దఫా భీమిలి అసెంబ్లీ నుంచి పోటీచేసి విజయం దక్కించుకున్నారు. ఈయన కాపుసామాజికవర్గ నేత కావడం, ఆవర్గం ఓట్లను ఆకట్టుకోవడం కోసం బాబు కూడా ఈయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చినమాట ప్రకారం గంటాకు మంత్రి పదవిని కట్టబెట్టారు.
బండారుకు అసాధ్యమే... : టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి జిల్లాకు రెండు మంత్రి పదవులను ఇవ్వడం ఆనవాయితీ. వాటిలో ఒకటి ఏజెన్సీలో ఒకరికి కట్టబెట్టేవారు. ఈసారి పాడేరు సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడి నుంచి మంత్రి పదవి కోసం పోటీ లేకుండా పోయింది. అలాగే ఇప్పటికే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్తుతో బండారుకు మంత్రి గిరీ అసాధ్యంగానే మిగలనుంది. మరో పక్క విశాఖ నగరంలో ఉత్తరం సీటు నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ ప్రభుత్వంలో తనకు పదవి ఖాయమని భావించారు. బీజేపీకి ఇచ్చిన పదవుల్లో ఈయనకు చోటు దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు.