రసకందాయంలో విశాఖ రాజకీయం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకోనేందుకు యత్నిస్తున్న ప్రయత్నాలను తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం కొణతాల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులోభాగంగా మంగళవారం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ నివాసంలో విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా సమావేశమై చర్చించారు. పార్టీలో కొణతాల, గండి బాబ్జిల చేరికను వ్యతిరేకించాలని సదరు ఎమ్మెల్యేలంతా నిర్ణయించినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 ఏళ్ల పాటు మనపైన పార్టీపైన పోరాడిన మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జిని ఎలా చేర్చుకుంటారంటూ మాజీ మంత్రి, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఓ వేళ కొణతాల కుటుంబం మన సైకిల్ ఎక్కితే పార్టీ కార్యకర్తలు సహించరంటూ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కొణతాల చేరికకు మంత్రి అయ్యన్నపాత్రుడు పూర్తిగా సహకరిస్తున్నాడంటూ... జిల్లా ఎమ్మెల్యేలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలోకి కొణతాల చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అనుకుంటున్న తరుణంలో జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి వర్గం ఎదురు తిరిగింది. దాంతో జిల్లాలో రాజకీయం రసకందాయంలో పడింది.