konathala ramakirshna
-
నాగబాబుకి ఎంపీ సీటు..కొణతాల అసంతృప్తి
-
‘తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని చెప్పారు’
సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృందం విఙ్ఞప్తి చేసింది. మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఈ బృందం మంగళవారం వెంకయ్య నాయుడును కలిసింది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే బడ్జెట్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర నిపుణులు రూపొందించిన ఫాక్ట్ రిపోర్ట్‌ను తాము వివిధ జాతీయ నేతలకు అందజేస్తామని వెల్లడించింది. ప్రత్యేక హోదా సహా హామీలన్నింటికీ వారి మద్దతు కోరనున్నట్లు పేర్కొంది. తన శక్తి మేరకు ప్రయత్నిస్తానన్నారు.. ప్రత్యేక హోదా సాధనకు రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వుందని ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృందం అభిప్రాయపడింది. ఈ విషయంలో నాలుగున్నరేళ్లుగా కేంద్రం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం చివరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అయినా సరైన కేటాయింపులు జరపకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నికల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమాధానం చెబుతారని పేర్కొంది. హామీల అమలు విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును జోక్యం చేసుకోవాలని కోరగా... తెలుగు వాడిగా తన స్థాయిననుసరించి హామీల అమలుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించింది. విశాఖ రైల్వేజోన్‌పై ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటన వెలువడుతుందని వెంకయ్య చెప్పినట్లు పేర్కొంది. -
రసకందాయంలో విశాఖ రాజకీయం
-
రసకందాయంలో విశాఖ రాజకీయం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకోనేందుకు యత్నిస్తున్న ప్రయత్నాలను తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం కొణతాల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులోభాగంగా మంగళవారం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ నివాసంలో విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా సమావేశమై చర్చించారు. పార్టీలో కొణతాల, గండి బాబ్జిల చేరికను వ్యతిరేకించాలని సదరు ఎమ్మెల్యేలంతా నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 ఏళ్ల పాటు మనపైన పార్టీపైన పోరాడిన మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జిని ఎలా చేర్చుకుంటారంటూ మాజీ మంత్రి, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఓ వేళ కొణతాల కుటుంబం మన సైకిల్ ఎక్కితే పార్టీ కార్యకర్తలు సహించరంటూ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కొణతాల చేరికకు మంత్రి అయ్యన్నపాత్రుడు పూర్తిగా సహకరిస్తున్నాడంటూ... జిల్లా ఎమ్మెల్యేలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలోకి కొణతాల చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అనుకుంటున్న తరుణంలో జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి వర్గం ఎదురు తిరిగింది. దాంతో జిల్లాలో రాజకీయం రసకందాయంలో పడింది. -
పార్టీ బలోపేతం.. సమైక్య రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: రానున్న సాధారణ ఎన్నికలు, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, సమైక్య రాష్ట్రం కోసం నిర్వహించాల్సిన ఆందోళన కార్యక్రమాలే ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సోమవారంనాడిక్కడ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలకు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు. ప్రధానంగా గ్రామస్థాయిల్లో కమిటీల ఏర్పాటు, కో-ఆర్డినేటర్ల పనితీరు బేరీజు వేసుకుంటూ సమీప భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తమ ప్రసంగాల్లో నేతలకు వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యులు పలువురు మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తూనే వైఎస్సార్సీపీపై నిందలు మోపుతూ కుట్రలు చేస్తున్నాయని, అడుగడుగునా వాటిని ఎండగట్టాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు అప్రమత్తంగా ఉంటూ వచ్చే మూడు నెలల కాలం ఎంత కీలకమైందో వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీజీసీ, సీఈసీ, పార్లమెంటు పరిశీలకులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, జిల్లా కన్వీనర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం..: జరగబోయే పరిణామాల దృష్ట్యా ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే ఆలోచనతో అందుకు తమ పార్టీని సంసిద్ధం చేయడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సమావేశానంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం కోసం జగన్మోహన్రెడ్డి కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలందరికీ మరోసారి తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతున్నందున 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరినీ చేర్పించాలని నేతలను ఆదేశించినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ప్రాంతాలకు న్యాయం చేసిన అంశాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రాన్ని ఎలా సమైక్యంగా ఉంచారో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. విభజన జరగలేదంటూనే, అందుకు కావాల్సిన పూర్తి సహకారాలు కేంద్రానికి సీఎం అందిస్తున్నారని దుయ్యబట్టారు. సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన జూలై 30న సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసుంటే ప్రక్రియ నిలిచిపోయేదన్నారు. తెలంగాణపై జగన్‌తో ప్రత్యేక భేటీ: తెలంగాణలో పార్టీ ఏవిధంగా ముందుకెళ్తుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు బాజిరెడ్డి బదులిస్తూ.. ‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీలు రెండూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఇరు ప్రాంత నేతలు రెండు రకాల వాదనలు చేస్తున్నారు. కానీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే ఒకే విధానంతో ప్రజల్లోకి వెళ్తోంది. కాబట్టి తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నాయకులకు ఎదురవుతున్న సమస్యలపై అధ్యక్షులు జగన్ ప్రత్యేకంగా భేటీ నిర్వహించి మనోధైర్యం కల్పించాలని కోరాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట చంద్రశేఖర్, ధర్మాన కృష్ణదాస్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గట్టు రామచంద్రరావు, దాడి వీరభద్రరావు, పి.ఎన్.వి.ప్రసాద్, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కొల్లి నిర్మల, జలీల్‌ఖాన్, నల్లా సూర్యప్రకాశ్, ఎడ్మ కృష్ణారెడ్డి, బి.జనక్‌ప్రసాద్, ఉప్పులేటి కల్పనతో పాటుగా పలువురు ప్రసంగించారు. ఎస్.పి.వై.రెడ్డి, చేగొండి హరిరామ జోగయ్య వేదికను అలంకరించిన వారిలో ఉన్నారు. -
కుట్రతోనే శంఖారావానికి అనుమతి నిరాకరణ: కొణతాల రామకృష్ణ
నక్కపల్లి, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లో ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం కాంగ్రెస్, టీడీపీల కుట్రలో భాగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఆరోపించారు. తమ పార్టీకి ప్రజాదరణ మరింతగా పెరుగుతుందన్న భయంతోనే ఈ రెండు పార్టీలు కుట్రపన్ని సభకు అడ్డు తగులుతున్నాయని విమర్శించారు. మంగళవారం ఆయన విశాఖజిల్లా నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేత నరేంద్రమోడీ సభకు, సీమాంధ్ర జేఏసీ, తెలంగాణ జేఏసీ నిర్వహించిన సభలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తమ అభిప్రాయాన్ని సమైక్య శంఖారావం ద్వారా వినిపించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి భావిస్తే, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొణతాల మండిపడ్డారు. సభ నిర్వహిస్తే తీవ్రవాదులు, తెలంగాణవాదులతో ఇబ్బందులు వస్తాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో దీక్ష చేసిన చంద్రబాబు ఏరోజూ తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పలేదని ఆరోపించారు. సమైక్యాంధ్రకు జగన్ సీఎం అవడం ఖాయమని, అప్పుడు తమ కుంభకోణాలు బయటకు వస్తాయోననే భయం టీడీపీని వణికిస్తోందని చెప్పారు. -
చీకటి ఒప్పందాల రెన్యువల్‌కే
చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై కొణతాల వ్యాఖ్య జగన్ బెయిల్‌ను అడ్డుకోవాలని కాంగ్రెస్ పెద్దల కాళ్లపై పడటానికి ఢిల్లీ వెళ్తున్నారంటూ ధ్వజం రాష్ట్రం రగులుతూ ఉంటే నీచరాజకీయాలతో ప్రజలను మోసగిస్త్తున్నారని విమర్శ నక్కపల్లి (విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని.. వాటిని మూడు నెలలకోసారి రెన్యువల్ చేయించుకునేందుకు తరచూ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను రహస్యంగా కలుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ గురించి మాట్లాడేందుకే చంద్రబాబు ఢిల్లీ యాత్రకు వెళుతున్నారని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానించటం బాబు చీకటి ఒప్పందాలకు నిదర్శనమని పేర్కొన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో ఉన్న షర్మిలను కలిసేందుకు ఆదివారం విశాఖ జిల్లా నక్కపల్లికి వచ్చిన కొణతాల ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునే దమ్ము, ధైర్యం లేకనే టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై సీబీఐ చేత అక్రమ కేసులు బనాయించి ఆయనను అరెస్టు చేయించారని గుర్తుచేశారు. తుది చార్జిషీట్ల పేరుతో బెయిల్ రాకుండా అడ్డుకోవటంలో ఆ రెండు పార్టీల పాత్ర ఉందన్న విషయం సుస్పష్టమన్నారు. తుది చార్జిషీటు దాఖలుకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో పూర్తయిందని.. అది దాఖలయ్యాక జగన్‌కు బెయిల్ రావటం ఖాయమని చంద్రబాబు భయపడుతున్నారని కొణతాల చెప్పారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, ఆర్థికమంత్రి చిదంబరం తదితర కాంగ్రెస్ పెద్దల కాళ్లా వేళ్లా పడటానికి ఇప్పుడు బాబు ఢిల్లీ వెళుతున్నారని ధ్వజమెత్తారు. విభజన ప్రకటనతో రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంటే చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతూ ఇరు ప్రాంతాల వారిని మోసం చేస్తున్నారని ఈసడించారు. బాబు ఆత్మగౌరవం పేరుతో ఆత్మవంచన యాత్ర చేపట్టినా.. ఇప్పటివరకు ఎక్కడా తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటన చేయలేదని కొణతాల గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఏకమై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాకోర్టులో జగన్మోహన్రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు, పార్టీ నాయకుడు వీసం రామకృష్ణ పాల్గొన్నారు. -
వైఎస్ మరణం తరువాత రాష్ట్రం రావణకాష్టం: కొణతాల రామకృష్ణ
ముసునూరు, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ మరణం తరువాత రాష్ట్రంలో నాయకత్వ సమస్య నెలకొనడంతో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని వేల్పుచర్ల దళితవాడలో జరిగిన ఓ వివాహ వేడుకకు శనివారం హాజరైన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ మరణం తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సమస్యలే కనబడుతున్నాయని విమర్శించారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్‌ను దెబ్బకొట్టడానికి కుట్రలు పన్నుతున్నాయని, రాష్ట్ర విభజన కూడా ఈ కుట్రలో భాగమేనని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్ విజయమ్మ దీక్షకు తరలిరండి: కొణతాల రామకృష్ణ
వైఎస్సార్సీపీ నేత కొణతాల పిలుపు.. బందరు రోడ్డు పీవీపీ కాంప్లెక్స్ సభాస్థలిలో దీక్షకు ఏర్పాట్లు 19 ఉదయం నుంచి ఆమరణ దీక్ష చేయనున్న విజయమ్మ అనకాపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్ విజయమ్మ చేపడుతున్న ఆమరణ దీక్షకు మద్దతుగా పార్టీ శ్రేణులు కదిలి రావాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక కొణతాల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలో విజయమ్మ చేపట్టే దీక్షకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 22 నుంచి వైఎస్ఆర్ సీపీ చేపట్టే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేసే బాధ్యత పార్టీ శ్రేణులదేనన్నారు. ఒకవైపు తెలంగాణా ఇచ్చేశామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెబుతుంటే మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ పార్టీ నేతలు ఏ విధంగా పాల్గొంటారని ఈ సందర్భంగా కొణతాల ప్రశ్నించారు. విజయవాడలో దీక్షావేదిక ఖరారు.. సాక్షి ప్రతినిధి, విజయవాడ: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు వేదిక ఖరారైంది. బందరు రోడ్డు చెన్నుపాటి పెట్రోల్‌బంక్ సమీపంలోని పీవీపీ కాంప్లెక్స్‌ను ఆనుకుని దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకులు నిర్ణయించారు. కాంప్లెక్స్‌ను ఆనుకుని ఉన్న విశాల స్థలంలో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ఎదురుగా బ్యారికేడ్లు, వేదికకు ఇరువైపులా సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమరణ దీక్షలో విజయమ్మ ఒక్కరే: ఈ నెల 19 ఉదయం విజయమ్మ దీక్షను ప్రారంభిస్తారు. విజయమ్మతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వారిని పార్టీ నేతలు వారిస్తున్నారు. విజయమ్మ మాత్రమే దీక్ష చేస్తారని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేయొచ్చని సూచిస్తున్నారు. వర్షం వల్ల దీక్షా శిబిరంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన నేతలు: దీక్ష చేపట్టబోయే ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, నియోజకవర్గ ఇన్చార్జిలు పేర్ని వెంకట్రామయ్య(నాని), జోగి రమేశ్, వంగవీటి రాధాకృష్ణ, పూనూరు గౌతంరెడ్డి, పడ మటి సురేష్‌బాబు, తాతినేని పద్మావతి, నాయకులు అడుసుమిల్లి జయప్రకాశ్, రాజ్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు.