
వైఎస్ విజయమ్మ దీక్షకు తరలిరండి: కొణతాల రామకృష్ణ
వైఎస్సార్‌సీపీ నేత కొణతాల పిలుపు..
బందరు రోడ్డు పీవీపీ కాంప్లెక్స్ సభాస్థలిలో దీక్షకు ఏర్పాట్లు
19 ఉదయం నుంచి ఆమరణ దీక్ష చేయనున్న విజయమ్మ
అనకాపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్ విజయమ్మ చేపడుతున్న ఆమరణ దీక్షకు మద్దతుగా పార్టీ శ్రేణులు కదిలి రావాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక కొణతాల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలో విజయమ్మ చేపట్టే దీక్షకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 22 నుంచి వైఎస్‌ఆర్ సీపీ చేపట్టే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేసే బాధ్యత పార్టీ శ్రేణులదేనన్నారు. ఒకవైపు తెలంగాణా ఇచ్చేశామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెబుతుంటే మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ పార్టీ నేతలు ఏ విధంగా పాల్గొంటారని ఈ సందర్భంగా కొణతాల ప్రశ్నించారు.
విజయవాడలో దీక్షావేదిక ఖరారు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు వేదిక ఖరారైంది. బందరు రోడ్డు చెన్నుపాటి పెట్రోల్‌బంక్ సమీపంలోని పీవీపీ కాంప్లెక్స్‌ను ఆనుకుని దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకులు నిర్ణయించారు. కాంప్లెక్స్‌ను ఆనుకుని ఉన్న విశాల స్థలంలో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ఎదురుగా బ్యారికేడ్లు, వేదికకు ఇరువైపులా సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆమరణ దీక్షలో విజయమ్మ ఒక్కరే: ఈ నెల 19 ఉదయం విజయమ్మ దీక్షను ప్రారంభిస్తారు. విజయమ్మతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వారిని పార్టీ నేతలు వారిస్తున్నారు. విజయమ్మ మాత్రమే దీక్ష చేస్తారని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేయొచ్చని సూచిస్తున్నారు. వర్షం వల్ల దీక్షా శిబిరంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన నేతలు: దీక్ష చేపట్టబోయే ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పేర్ని వెంకట్రామయ్య(నాని), జోగి రమేశ్, వంగవీటి రాధాకృష్ణ, పూనూరు గౌతంరెడ్డి, పడ మటి సురేష్‌బాబు, తాతినేని పద్మావతి, నాయకులు అడుసుమిల్లి జయప్రకాశ్, రాజ్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు.