సాక్షి, అమరావతి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన ప్రసంగం తరువాత తల్లి వైఎస్ విజయమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పదేళ్ల పాటు అలుపెరుగని పోరు సాగించి, కష్టనష్టాలు భరించి అశేషాంధ్రుల మనసు చూరగొని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. గురువారం విజయవాడ నగర నడిబొడ్డున అశేష జనవాహిని, పార్టీ శ్రేణుల నడుమ సాగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రతీ క్షణాన్ని వైఎస్ విజయమ్మ ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. కీలక నిర్ణయాలు వెలువరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులు చేస్తూ ప్రతిస్పందించారు.
ప్రసంగం ముగింపులో ‘ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తున్నా.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు’ అని వైఎస్ జగన్ అనగానే ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.జగన్‌ను తదేకంగా చూస్తూ తన్మయత్వం చెందుతూ లేచి నిలుచున్నారు. ఆమె కంట ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. ప్రసంగం ముగించి వస్తున్న జగన్.. ఆ దృశ్యాన్ని గమనించి తల్లి దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ పర్పరం ఒక్కసారిగా ఆత్మీయంగా రెండు చేతులతో గుండెలకు హత్తుకున్నారు. తన్నుకొచ్చే ఆనంద భాష్పాల మధ్య ఆ సమయంలో ఆమె నోటి వెంట మాట రాలేదు. చెమ్మగిల్లిన తల్లి కళ్లు తుడిచి జగన్ ఓదార్చారు. మాతృ మూర్తి ప్రేమలో ముగ్ధుడవుతూ వీపుపై చేతులతో తడుతూ ‘అమ్మా..’ అని పలకరించే ప్రయత్నం చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన అకాల మరణంతో ఒక్కడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్‌కు అమ్మ విజయమ్మే అండగా నిలిచింది. పదేళ్లుగా కొడుకు పడిన కష్టాలు, కన్నీళ్లు చూస్తూ తల్లడిల్లిపోయింది. ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ప్రజల్లోకి పంపించింది. తండ్రి ఆశయ సాధనలో అలుపెరగని పోరాటం చేసి.. ప్రజల ఆశీస్సులతో ఆఖండ విజయం సొంతం చేసుకున్న కొడుకును చూసి విజయమ్మ తల్లిగానే స్పందించారు. కొద్ది క్షణాల పాటు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన ప్రజలు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఢిల్లీకి రాజైనా ఆ అమ్మకు కొడుకే కదా..’ అన్న నానుడిని గుర్తుకు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment