నవ్యాంధ్రకు నవోదయం | YS Jagan Mohan Reddy Swearing Ceremony Special Story | Sakshi
Sakshi News home page

నవ్యాంధ్రకు నవోదయం

Published Thu, May 30 2019 6:53 AM | Last Updated on Thu, May 30 2019 7:49 AM

YS Jagan Mohan Reddy Swearing Ceremony Special Story - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మహోత్తర ఘట్టానికి ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానం ముస్తాబైంది. విజయవాడ నగరంలో జరిగే ఈ వేడుకలకు ఐదు వేల మంది భద్రతా బలగాల పహారా కాస్తున్నాయి. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉన్నతాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల భద్రత, ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఊహించని విధంగా ప్రజలు తరలిరానున్నారనే సమాచారంతో ప్రమాణ స్వీకరాత్సోవ కార్యక్రమాన్ని అత్యధికులు వీక్షించేందుకు అనువుగా నగరంలో 14 ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

12 వేల మందికి పాస్‌లు..
ముఖ్యమంత్రిగా జననేత వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసే అతిథుల కోసం మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు వారికి ఐదు రకాల పాస్‌లు రూపొందించారు. దాదాపు 12వేల మందికి ఈ పాస్‌లను అందజేశారు. అలాగే సాధారణ ప్రజల కోసం గ్యాలరీల్లోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండంతస్తులు ఉండే గ్యాలరీల్లో 18వేల మంది కూర్చునేందుకు వీలుంది. వీరితోపాటు స్టేడియంలోని ఫుట్‌బాల్‌ మైదానంలో మరో 10వేల మంది వరకు వీక్షించేందుకు అనువుగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే వాహనాలను శిఖామణి సెంటర్‌ వరకు అనుమతిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి నిర్దేశిత ప్రాంతాల్లో ఆయా వాహనాలను పార్కింగ్‌ చేయాలి. కార్యక్రమం పూర్తయ్యాక ప్రజలను మినీబస్సులు, స్వరాజ్‌మజ్దా వంటి వాహనాల్లో పార్కింగ్‌ ప్రాంతాలకు తరలిస్తారు.

ఐదు వేల మందితో భారీ బందోబస్తు..
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 18 డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే పాల్కన్‌ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఏపీఎస్పీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ దళాలతోపాటు సాధారణ పోలీసుల కలిపి మొత్తం 5 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా మావోయిస్టులను గుర్తించే సిబ్బందిని విధుల్లో ఉంచారు.


వేడుకకు ముస్తాబైన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..
విజయవాడ మీదుగా హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై వెళ్లే వాహనాలను శివారు మీదుగా మళ్లిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలయ్యాయి. నగరంలో స్టేడియం మీదుగా వెళ్లే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు. అలాగే గురువారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బందర్‌ రోడ్డులో ఎలాంటి వాహనాలకు అనుమతించడం లేదు. ఆర్టీసీ బస్సులను సైతం ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు. పాసులు ఉన్నవారంతా ఉదయం 10.30గంటల లోపు స్టేడియంలోకి చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏర్పాట్లు పూర్తి కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసిందన్నారు. స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ వైఎస్‌ జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని సుమారు 30వేల మంది తిలకించేందుకు స్టేడియంలో సీటింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రజలనుద్ధేశించి సీఎం ప్రసంగిస్తారని తెలిపారు. ఉదయం 10 గంటలకే స్టేడియంకు చేరుకుని తమ, తమ గ్యాలరీల్లో, సీట్లలో కూర్చోవాలని ప్రజలకు కలెక్టర్‌ కోరారు. స్టేడియంకు రాలేని వారు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా ఈ కార్యక్రమాన్ని  తిలకించాలని సూచించారు. మీడియాకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

భారీ స్క్రీన్‌లు ఏర్పాటు
సత్యనారాయణపురం : ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో తక్కువ సీటింగ్‌ ఉండటంతో స్టేడియం బయట నగర వ్యాప్తంగా ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రజలు వీక్షించేందుకు భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు సత్యనారాయణపురం పరిధిలోని బీఆర్టీఎస్‌రోడ్డు, గవర్నమెంట్‌ ప్రెస్‌ సమీపంలో ఆయా స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్‌ మళ్లింపు..
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను హనుమాన్‌ జంక్షన్, నూజివీడు, విసన్నపేట, కల్లూరు, వైరా, ఖమ్మం, సూర్యపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాలి. అలాగే హనుమాన్‌ జంక్షన్, నూజివీడు, మైలవరం, .జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌కు మరో మార్గం ద్వారా వెళ్లవచ్చు. హనుమాన్‌ జంక్షన్, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, కంచికచర్ల మీదుగా హైదరాబాద్‌ ఇంకొక మార్గం ఉంది.
విశాఖ టు చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్‌ జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా మళ్లించారు. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్‌లో రావాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌ టు చెన్నై వాహనాలను నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాలి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే మార్గంలో రావాల్సిం ఉంది.
మచిలీపట్నం టు విజయవాడ వచ్చే వాహనాలు పామర్రు జంక్షన్, గుడివాడ జంక్షన్, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విజయవాడకు చేరుకుంటాయి.

జంక్షన్‌లో ఇలా..
హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా హనుమాన్‌జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విజయవాడ వైపు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్‌ సెంటర్‌ నుంచి నూజివీడు వైపునకు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను గుడివాడ వైపునకు దారి మళ్లించామని పోలీసులు తెలిపారు. భారీ సరుకు రవాణా వాహనాలను వీరవల్లి డెల్టా సుగర్స్‌ వద్ద, బొమ్ములూరు పుష్పహోటల్‌ వద్ద నిలిపి వేయాలని హనుమాన్‌జంక్షన్‌ సీఐ ఎన్‌.రాజశేఖర్, ఎస్‌ఐలు వి.సతీష్, కె.ఉషారాణి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎం.నాగ దుర్గారావు ఆదేశించారు.

విజయవాడ నగరంలో..
నగరంలో ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే రామవరప్పాడు, 100 అడుగుల రహదారి మీదుగా బెంజిసర్కిల్‌ పాసింజర్‌ వాహనాలను అనుమతిస్తారు. ఆ తర్వాత కేవలం పాస్‌లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వాహనాలను బీఆర్‌టీఎస్, తాడిగడప, పోరంకి మీదుగా మళ్లిస్తారు. అలాగే గొల్లపూడి నుంచి నగరంలోకి వచ్చే వాహనాలను ఉదయం 10 గంటల వరకు ఘాట్‌ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. ఆ తర్వాత పైపులరోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కనకదుర్గా వారధి మీద ఉన్న ఫారెస్టు చెక్‌పోస్టు నగరంలోకి వచ్చే వాహనాలను నేతాజీ బ్రిడ్జి, వెటర్నరీ హాస్పిటల్‌ మీదుగా ఉదయం 10 గంటల వరకు అనుమతిస్తారు. తర్వాత పాస్‌లు ఉన్న వాహనాలను అనుమతిస్తారు. మిగిలిన వాహనాలను ఆర్టీసీ బస్టాండ్, పోలీసు కంట్రోల్‌ రూమ్, కాల్‌టెక్స్‌రోడ్డు మీదుగా బీఆర్‌టీఎస్‌ రహదారికి వెళ్లాల్సి ఉంటుంది. డీసీపీ బంగ్లా వైపు కూడా కేవలం ఉదయం 10 గంటల వరకు వాహనాలను అనుమతిస్తారు. ఆ తర్వాత బీఆర్‌టీఎస్‌ మీదుగా ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుంది. నేతాజీ బ్రిడ్జి నుంచి వెళ్లే వాహనాలను బెంజిసర్కిల్‌ మీదుగా, డీవీ మ్యానర్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలను శిఖామణి సెంటర్‌కు, బెంజిసర్కిల్‌ సర్కిల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు, శిఖామణి సెంటర్‌ మీదుగా మళ్లిస్తారు.

నగరంలో ఆర్టీసీ బస్సుల మళ్లింపు..
బస్‌స్టేషన్‌: ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం గురువారం బందరురోడ్డులో బస్సులు తిరిగేందుకు వీలులేకుండా నిలిపివేసినట్లు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ శ్రీరాములు ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్‌శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు, భద్రతా విభాగం అధికారుల ఆదేశాల మేరకు వేకువజాము గం.6 నుంచి మధ్యాహ్నం గం.3 వరకు ఆ రూట్‌లో తిరిగే 200కు పైగా బస్సులను ఏలూరు రోడ్డు, 5వ నంబరు రోడ్డు మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత యథాతథంగా బస్సులు తిరుగుతాయని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement