
వైఎస్ మరణం తరువాత రాష్ట్రం రావణకాష్టం: కొణతాల రామకృష్ణ
ముసునూరు, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ మరణం తరువాత రాష్ట్రంలో నాయకత్వ సమస్య నెలకొనడంతో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని వేల్పుచర్ల దళితవాడలో జరిగిన ఓ వివాహ వేడుకకు శనివారం హాజరైన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ మరణం తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సమస్యలే కనబడుతున్నాయని విమర్శించారు. వైఎస్సార్‌సీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్‌ను దెబ్బకొట్టడానికి కుట్రలు పన్నుతున్నాయని, రాష్ట్ర విభజన కూడా ఈ కుట్రలో భాగమేనని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.