పార్టీ బలోపేతం.. సమైక్య రాష్ట్రం | Strengthening the party and Samaikyandhra Pradesh are YSR Congress party's agenda | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతం.. సమైక్య రాష్ట్రం

Published Tue, Nov 19 2013 3:35 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

పార్టీ బలోపేతం.. సమైక్య రాష్ట్రం - Sakshi

పార్టీ బలోపేతం.. సమైక్య రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్: రానున్న సాధారణ ఎన్నికలు, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, సమైక్య రాష్ట్రం కోసం నిర్వహించాల్సిన ఆందోళన కార్యక్రమాలే ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సోమవారంనాడిక్కడ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలకు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు. ప్రధానంగా గ్రామస్థాయిల్లో కమిటీల ఏర్పాటు, కో-ఆర్డినేటర్ల పనితీరు బేరీజు వేసుకుంటూ సమీప భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తమ ప్రసంగాల్లో నేతలకు వివరించారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యులు పలువురు మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తూనే వైఎస్సార్‌సీపీపై నిందలు మోపుతూ కుట్రలు చేస్తున్నాయని, అడుగడుగునా వాటిని ఎండగట్టాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు అప్రమత్తంగా ఉంటూ వచ్చే మూడు నెలల కాలం ఎంత కీలకమైందో వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీజీసీ, సీఈసీ, పార్లమెంటు పరిశీలకులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, జిల్లా కన్వీనర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 ముందస్తు ఎన్నికలకు సిద్ధం..: జరగబోయే పరిణామాల దృష్ట్యా ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే ఆలోచనతో అందుకు తమ పార్టీని సంసిద్ధం చేయడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.  సమావేశానంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలందరికీ మరోసారి తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతున్నందున 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరినీ చేర్పించాలని నేతలను ఆదేశించినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ప్రాంతాలకు న్యాయం చేసిన అంశాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రాన్ని ఎలా సమైక్యంగా ఉంచారో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. విభజన జరగలేదంటూనే, అందుకు కావాల్సిన పూర్తి సహకారాలు కేంద్రానికి సీఎం అందిస్తున్నారని దుయ్యబట్టారు. సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన జూలై 30న సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసుంటే ప్రక్రియ నిలిచిపోయేదన్నారు.
 
 
 తెలంగాణపై జగన్‌తో ప్రత్యేక భేటీ: తెలంగాణలో పార్టీ ఏవిధంగా ముందుకెళ్తుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు  బాజిరెడ్డి బదులిస్తూ.. ‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీలు రెండూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఇరు ప్రాంత నేతలు రెండు రకాల వాదనలు చేస్తున్నారు. కానీ ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే ఒకే విధానంతో ప్రజల్లోకి వెళ్తోంది. కాబట్టి తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నాయకులకు ఎదురవుతున్న సమస్యలపై అధ్యక్షులు జగన్ ప్రత్యేకంగా భేటీ నిర్వహించి మనోధైర్యం కల్పించాలని కోరాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట చంద్రశేఖర్, ధర్మాన కృష్ణదాస్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గట్టు రామచంద్రరావు, దాడి వీరభద్రరావు, పి.ఎన్.వి.ప్రసాద్, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి,  కొల్లి నిర్మల, జలీల్‌ఖాన్, నల్లా సూర్యప్రకాశ్, ఎడ్మ కృష్ణారెడ్డి, బి.జనక్‌ప్రసాద్, ఉప్పులేటి కల్పనతో పాటుగా పలువురు ప్రసంగించారు. ఎస్.పి.వై.రెడ్డి, చేగొండి హరిరామ జోగయ్య వేదికను అలంకరించిన వారిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement