
కుట్రతోనే శంఖారావానికి అనుమతి నిరాకరణ: కొణతాల రామకృష్ణ
నక్కపల్లి, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లో ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం కాంగ్రెస్, టీడీపీల కుట్రలో భాగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఆరోపించారు. తమ పార్టీకి ప్రజాదరణ మరింతగా పెరుగుతుందన్న భయంతోనే ఈ రెండు పార్టీలు కుట్రపన్ని సభకు అడ్డు తగులుతున్నాయని విమర్శించారు. మంగళవారం ఆయన విశాఖజిల్లా నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేత నరేంద్రమోడీ సభకు, సీమాంధ్ర జేఏసీ, తెలంగాణ జేఏసీ నిర్వహించిన సభలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తమ అభిప్రాయాన్ని సమైక్య శంఖారావం ద్వారా వినిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తే, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొణతాల మండిపడ్డారు. సభ నిర్వహిస్తే తీవ్రవాదులు, తెలంగాణవాదులతో ఇబ్బందులు వస్తాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో దీక్ష చేసిన చంద్రబాబు ఏరోజూ తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పలేదని ఆరోపించారు. సమైక్యాంధ్రకు జగన్ సీఎం అవడం ఖాయమని, అప్పుడు తమ కుంభకోణాలు బయటకు వస్తాయోననే భయం టీడీపీని వణికిస్తోందని చెప్పారు.