సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృందం విఙ్ఞప్తి చేసింది. మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఈ బృందం మంగళవారం వెంకయ్య నాయుడును కలిసింది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే బడ్జెట్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర నిపుణులు రూపొందించిన ఫాక్ట్ రిపోర్ట్‌ను తాము వివిధ జాతీయ నేతలకు అందజేస్తామని వెల్లడించింది. ప్రత్యేక హోదా సహా హామీలన్నింటికీ వారి మద్దతు కోరనున్నట్లు పేర్కొంది.
తన శక్తి మేరకు ప్రయత్నిస్తానన్నారు..
ప్రత్యేక హోదా సాధనకు రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వుందని ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృందం అభిప్రాయపడింది. ఈ విషయంలో నాలుగున్నరేళ్లుగా కేంద్రం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం చివరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో అయినా సరైన కేటాయింపులు జరపకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నికల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమాధానం చెబుతారని పేర్కొంది. హామీల అమలు విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును జోక్యం చేసుకోవాలని కోరగా... తెలుగు వాడిగా తన స్థాయిననుసరించి హామీల అమలుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించింది. విశాఖ రైల్వేజోన్‌పై ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటన వెలువడుతుందని వెంకయ్య చెప్పినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment