మంత్రి గంటాపై ఫిర్యాదు.. టీడీపీలో కలవరం
► సీఎంను కలిసేందుకు విజయవాడకు పయనం!
విశాఖపట్నం: విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు సీహెచ్ అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య విభేదాలు ఆ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. విశాఖ భూకుంభకోణంపై ‘సిట్’ జరుపుతున్న విచారణకు హాజరైన మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు.. మంత్రి గంటాపై ఫిర్యాదు చేయడం పార్టీలో కలవరం సృష్టించింది. ఆనందపురం మండలం వేములవలసలో ప్రభుత్వ భూములను తమవిగా చూపి మంత్రి సమీప బంధువు పరుచూరి భాస్కరరావు ఇండియన్ బ్యాంకు నుంచి రూ.190 కోట్లు తీసుకున్న వైనంతోపాటు మరికొన్నింటిని అయ్యన్న సిట్‌కు సమర్పించినట్టు సమాచారం.
పనిలో పనిగా గంటాతో సఖ్యతగా ఉండే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపైనా భూకబ్జాల ఆరోపణలతో అయ్యన్న సిట్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అంతేగాక ఈ నెల 19న మరిన్ని ఆధారాలతో సిట్‌కు మరలా ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన విజయవాడకు పయనమయ్యారు. సీఎం చంద్రబాబును కలిసేందుకే ఆయన విజయవాడ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.